‘భారత్‌ మాతాకీ జై’ చట్టం తేవాలి- రాందేవ్‌ బాబా

భారత్ మాతాకీ జై నినాదం గురించి మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ రేపిన తేనెతుట్టు ఇప్పట్లో సద్దుమణిగేట్లు లేదు. తాజాగా యోగా గురువు రాందేవ్‌బాబా కూడా ఈ విషయమై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ‘భారత్‌ మాతాకీ జై’ అనేలా ఒక చట్టాన్ని తీసుకురావాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఈ నినాదం చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని అసదుద్దీన్‌ వ్యాఖ్యనించిన నేపథ్యంలో రాందేవ్‌ ఈ మాటలు అని ఉండవచ్చు.

ఇంతేకాదు! దేశమంతటా గోవధ నిషేధం అమలు జరిగేలా కూడా ఒక చట్టాన్ని ఏర్పాటు చేయమంటూ ఆయన మోదీని కోరారు. గోవధని కనుక నిషేధిస్తే, మతకలహాలు తగ్గిపోతాయని ఆయన పేర్కొన్నారు. నిజానికి 18వ శతాబ్దం వరకూ కూడా మన దేశంలో గోవధ నేరంగా ఉండేదనీ, ఔరంగజేబు కూడా దీన్ని సమర్థించాడనీ ఆయన చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్ నేత శశిథరూర్... కన్నయాకుమార్‌ను భగత్‌సింగ్‌తో పోల్చడం గురించి కూడా రాందేవ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాంటి పోలిక భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరులకు అవమానం అన్నారు. మొత్తానికి రాందేవ్‌గారు చాలా విషయాలే చెప్పుకొచ్చారు.