కమల్ హాసన్ కు షాక్: తమిళనాడులో విశ్వరూపం నిషేధం

 

కమల్ హస్సన్ తన విశ్వరూపం సినిమాను ఏ ముహుర్తాన్న మొదలుపెట్టారో గానీ ఆ సినిమాకు ఆది నుండి నేటి వరకు కూడా కష్టాలు తప్పట్లేదు. ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కానున్న ఆ సినిమాకి మరో కష్టం ఎదురయింది. తమిళనాడు ప్రభుత్వం విశ్వరూపం సినిమా ప్రదర్శనను రాష్ట్రంలో నిషేదిస్తూ నిన్న సాయత్రం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడుకు చెందిన కొన్ని ముస్లిం సంస్థలు ఆ సినిమాలో తమ వర్గాన్నిఉగ్రవాదులుగా చూపడాన్ని తప్పుబడుతూ, పెద్ద ఎత్తున నిరసనలు చేప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలితకు ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేయమని కోరుతూ వినతి పత్రం ఈయడంతో, ఆమె సినిమాపై నిషేధం విదించారు.

 

అయితే కమల్ హస్సన్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు బడుతూ అసలు సినిమానే చూడకుండా కేవలం సినిమా ట్రైలర్లను, వాల్ పేపర్లను చూసి ఈవిదంగా నిర్ణయం తీసుకోవడం అనుచితమని అయన అన్నారు.

 

 

మరో వైపు సాయి మీరా అనే సినిమా నిర్మాణ సంస్థ కూడా సినిమా విడుదలపై స్టే విదించాలంటూ నిన్న కోర్టుకెక్కింది. కమల్ హస్సన్ తో సినిమా తీసేందుకు తమ సంస్థ కుదుర్చుకొన్న ఒప్పందాన్ని అయన ఉల్లంగించడమే కాకుండా, ఆయనకు తాము ఇచ్చిన అడ్వాన్స్ రూ.10.5 కోట్లు కూడా ఇంతవరకు వాపసు చేయనందున విశ్వరూపం సినిమా విడుదలపై స్టే విదించాలని కోరుతూ వేసిన పిటిషన్ను కోర్టు స్వీకరించింది. ఇప్పటికే, తమిళనాడు సినిమా పంపిణీదారులతో, ధియేటర్ యజమానులతో చాలా తిప్పలుపడి ఎట్టకేలకు జనవరి 25వ తేదీన సినిమాను విడుదల చేయడానికి సిద్దమయిన కమల్ హస్సన్ కి తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం పెద్ద దెబ్బే అని చెప్పక తప్పదు. తెలుగు, హిందీ బాషలలోకూడా రేపు విడుదల కానున్న విశ్వరూపం సినిమా మరి విడుదల అవుతుందో లేదో కూడా అనుమానమే.