మంత్రి కొండా సురేఖకు కల్వకుంట్ల కవిత బర్త్ డే విషెస్!
posted on Aug 20, 2025 4:39PM

అమెరికా పర్యటనలో ఉన్నా కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాలలో సంచలనాలను సృష్టించే విషయంలో చాలా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ జన్మదినం సందర్భంగా ఆమెకు విషెస్ తెలుపుతూ ఒక బొకే పంపిచారు. ఆ విషయాన్ని కొండా సురేఖ ధృవీకరిస్తూ కవితకు కృతజ్ణతలు తెలుపుతూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు షేర్ చేశారు. ఇప్పుడు ఈ విషయమే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. కారణమేంటంటే.. కొండా సురేఖ, కేటీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. కొండా సురేఖ చేసిన విమర్శలపై కేటీఆర్ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో కోర్టు కొండా సురేఖను తప్పుపట్టింది కూడా. ఈ విషయంలో కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది కూడా.
ఇలా ఉండగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆమె సోదరి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినా మరెవరి నాయకత్వాన్ని అంగీకరించే ప్రశక్తే లేదని కవిత కుండబద్దలు కొట్టారు. అన్నా చెళ్లెళ్ల మధ్య విభేదాలు పీక్స్ కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కవితను కల్వకుంట్ల కుటుంబం దూరం పెడుతోందన్న వార్తలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే కవిత కొండా సురేఖకు బర్త్ డే విషెస్ తెలుపుతూ బొకే పంపించడం రాజకీయంగా ప్రాథాన్యత సంతరించుకుంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా కవిత కేటీఆర్ వ్యతిరేకుంలందరినీ మిత్రులుగా భావిస్తున్నారా? అందులో భాగంగానే కొండా సురేఖకు బర్త్ డే విషెస్ తెలుపుతూ బొకే పంపారా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.