వ్యూహం మూవీ నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్
posted on Aug 20, 2025 4:34PM

వ్యూహం మూవీ నిర్మాత దాసరి కిరణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దాసరి కిరణ్‌ను విజయవాడకు తరలించారు. కాగా ఈ సినిమాకు ప్రముఖ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ దర్శకత్వం వహించారు. వైఎస్ మరణం తరువాత జరిగిన రాజకీయ పరిస్థితుల్ని వ్యూహం మూవీలో ఆర్జీవీ చూపించారు
గతంలో రామ్ గోపాల్ వర్మపై టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వ్యూహం మూవీ ట్రైలర్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను అవమానించినందుకు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ కమిటీ సభ్యులు టి.గంగాధర్ ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే కాక మన దేశమంతా, శాంతి, భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్న ‘వ్యూహం’మూవీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైనా, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పైనా, నటులు అజ్మల్ అమీర్‌పైనా,నటి మానసా రాధాకృష్ణన్ పైనా, ఆ సినిమాలో నటించిన మొత్తం నటీ, నటుల పైనా,ఆ సినిమాకు పనిచేసిన 24 క్రఫ్ట్స్ సిబ్బంది మొత్తం పైనా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి తగు చర్యలు తీసుకొనమని పోలీసులను టి.గంగాధర్ కోరారు.