జస్టిస్ చౌదరి గెటప్‌లో ఎన్టీఆర్

 

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నందమూరి తారక రామరావుగారు తన నట జీవితంలో చేసిన వివిద రకాలయిన పాత్రలు, మరిక ఎప్పుడూ, ఎవరూకూడా చేయలేరని చెప్పవచ్చును. సామాన్యులని తన నటనతో ఆయన ఏవిధంగా మెప్పించారో, మహా మేదావులని కూడా అదే తీరున మెప్పించిన ఘనుడాయన. అయితే, అటువంటి మహా నటులు, గొప్ప పాత్రలు ఇప్పటి సినిమాలలో మనం చూసే అవకాశం లేదనే చెప్పుకోవాలి. అయినప్పటికీ తాతగారికి ఏకలవ్య శిష్యుడు అనదగ్గ యంగ్ టైగర్ జూ.యన్టీఆర్ మాత్రం అప్పుడప్పుడు తన సినిమాలలో ఆయనను అనుకరిస్తూ, అయన డైలాగులు పలుకుతూ మళ్ళీ ఆయన స్మృతులను మనకు జ్ఞాపకం చేస్తుంటాడు.

 

గతంలో జూ.యన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో మరో అడుగు ముందుకు వేసి గ్రాఫిక్స్ మాయజాలంతో ఏకంగా తాతగారితో కలిసి డైలాగులు చెప్పడమే కాకుండా కలిసి స్టెప్పులు కూడా వేశాడు. దానికి ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. మళ్ళీ అటువంటి ప్రయత్నమే ఇప్పుడు త్వరలో విడుదల కానున్న తన బాద్షా సినిమాలో కూడా చేయబోతున్నట్లు సమాచారం.

 

‘80లలో విడుదల అయిన నందమూరి వారి సూపర్ హిట్ సినిమా ‘జస్టిస్ చౌదరీ’ లో ఆయన నట విశ్వరూపం గురించి, ఆయన ధీర గంభీర స్వరంతో పలికిన భారీ డైలాగుల గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాలో తాతగారు పలికిన డైలాగులను బాద్షాలో జూ.యన్టీఆర్ చెప్పబోతున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాలో కూడా గ్రాఫిక్స్ మాయజాలంతో జూ.యన్టీఆర్ తాతగారితో కలిసి నటించిన ఒక కోర్టు సీను ఇంటర్వెల్ తరువాత ఉంటుందని సమాచారం.

 

ఇక, వీటికి అదనంగా యంగ్ టైగర్ చెప్పే పంచ్ డైలాగులు, చేసే ఫైట్స్, డ్యాన్సులు సినిమాలో ఉండనే ఉంటాయి. అవన్నీ చూసి ఆనందించాలంటే సినిమా కోసం మరికొంత కాలం ఎదురుచూపులు తప్పవు.