జయలలిత ఎస్టేట్‌ వాచ్ మెన్ దారుణ హత్య.. ఆస్తి పత్రాలు దగ్ధం

 

ఇప్పటికే తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపుతో రసవత్తరంగా మారుతుంటే ఇప్పుడు తాజాగా మరో ఘటన కలకలం రేపుతోంది. అదేంటంటే... దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఊటీలో ఉన్న 'కొడనాడ్' ఎస్టేట్ లో ఎన్నో ఏళ్ల నుండి వాచ్ మెన్ గా పనిచేస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని కొంతమంది దుండగలు అతన్ని దారుణంగా హత్య చేశారు. అంతేకాదు ఆమె ఆస్తులకు సంబంధించిన కీలకమైన దస్తావేజులు, డాక్యుమెంట్లను దగ్ధం చేశారు. అయితే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకే వాచ్ మెన్ ను హత్య చేసినట్టు తెలుస్తోంది.

 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే 10 మందితో కూడిన బృందంతో అక్కడికి వెళ్లారు. హత్యపై ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన బహదూర్ అనే వాచ్ మెన్ సహాయకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతను కోలుకుంటే ఈ కేసులో కీలక వివరాలు లభ్యం కాగలవని పోలీసులు భావిస్తున్నారు. ఆస్తిపత్రాలు దహనం అయిన విధానాన్నీ పరిశీలిస్తున్నారు. ఏఏ ఆస్తులకు సంబంధించిన పత్రాలను తగులబెట్టారన్న విషయమై, ఎస్టేట్ లోని మిగతా పనివాళ్ల నుంచి సమాచారాన్ని సేకరించే దిశగా ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ ఎస్టేట్ విలువ సుమారు రూ. 1000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఇదిలా ఉంచితే, వారం రోజుల క్రితం చెన్నైలోని జయలలిత గెస్ట్ హౌస్ లోనూ జయ ఆస్తి డాక్యుమెంట్లు కొన్ని తగులబడిన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu