ఏపీకి తుపాను గండం.. 'జ‌వాద్‌'తో జ‌ర జాగ్ర‌త్త‌..

ఏపీకి ఏ గ్ర‌హ‌ణ‌మో ప‌ట్టిన‌ట్టుంది. తీర‌ప్రాంతాన్ని ఏ శాప‌మో వెంటాడుతున్న‌ట్టుంది. పాల‌కులు చేస్తున్న పాపాలో.. ప్ర‌కృతి ప్ర‌కోప‌మో.. కార‌ణం ఏమో తెలీదు కానీ.. నిన్న‌టి వ‌ర‌కూ సీమ జిల్లాల‌ను వ‌రుణుడు దారుణంగా దెబ్బ తీస్తే.. తాజాగా ఉత్త‌రాంధ్ర‌పై జ‌వాద్ తుపాను విరుచుకుప‌డేందుకు రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది విశాఖకు 650 కి.మీ.. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 850 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం గంటకు 32 కి.మీ వేగంతో ముందుకు కదులుతోంది. శ‌నివారం ఉదయానికి ఉత్తరాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. జ‌వాద్‌ ప్రభావంతో శుక్ర‌వారం నుంచే వ‌ర్షాలు కురువ‌నున్నాయి. ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. భారీ వర్ష సూచనతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

శుక్ర‌వారం అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంలో ఈదురుగాలులు వీయ‌నున్నాయి. శ‌నివారం ఉదయం నుంచి 70-90 కి.మీ వేగంలో బలమైన గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు సోమవారం వరకు చేపల వేటకు వెళ్లరాదని తెలిపారు. 

తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జీవీఎంసీ, పోలీస్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున అధికారులకు సూచించారు. తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. తుపాను సహాయక చర్యల కోసం 66 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌, 55 ఎస్డీఆర్‌ఎఫ్‌ సభ్యులను సిద్ధం చేసినట్లు చెప్పారు.