ఏపీకి ముంచుకొస్తున్న తీవ్ర ముప్పు... విలయం తప్పదా? 

ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అపార నష్టం జరిగింది. వర్షాలు తగ్గి పది రోజులైనా నెల్లూరు, కడప జిల్లాలోని పలు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వరద బాధితులు సాయం కోసం పడిగాపులు పడుతున్నారు. వర్ష బీభత్సం నుంచి ఇంకా తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్ కు మరో గండం ముంచుకొస్తోంది. ఇటీవల జరిగిన వరద బీభత్సం కంటే ఈసారి విలయం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

ఉత్తరాంధ్ర వైపు తీవ్ర తుఫాను ముంచుకొస్తోంది. థాయ్‌లాండ్‌ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం బుధవారం అండమాన్‌ సముద్రం మధ్య ప్రాంతంలో ఉంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి గురువారంకల్లా వాయుగుండంగా మారి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత  24 గంటల్లోనే శుక్రవారానికి  తుఫాన్‌గా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే క్రమంలో వాయవ్యంగా పయనించి నాలుగో తేదీ ఉదయానికి ఉత్తరాంధ్ర తీరం దిశగా రానుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాపైఎక్కువ ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుఫాన్‌కు ‘జవాద్‌’ అని నామకరణం చేయనున్నారు. 

జవాద్ తుఫాన్ ప్రభావంతో మూడో తేదీ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. నాలుగో తేదీ తెల్లవారుజాము నుంచి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల్లో అసాధారణ వర్షాలు, తూర్పు గోదావరిలో అతిభారీ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల్లో 3వ తేదీ  ఉదయం నుంచి గాలుల తీవ్రత పెరుగుతుంది. గంటకు 45 నుంచి 55 కి.మీ., అప్పుడప్పుడు 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. తీవ్ర తుఫాన్‌ తీరం దిశగా వచ్చే సమయంలో (నాలుగో తేదీ తెల్లవారుజాము నుంచి) గంటకు 80 నుంచి 90 కి.మీ., అప్పుడప్పుడు 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.  3, 4 తేదీల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని పేర్కొంది. 

తీవ్ర తుఫాను ఉత్తరాంధ్ర తీరం దిశగా రానున్న నేపథ్యంలో మూడో తేదీ అర్ధరాత్రి నుంచి కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని, గాలుల తీవ్రత పెరిగే క్రమంలో కమ్యూనికేషన్‌ వ్యవస్థపై ప్రభావం పడుతుందని  వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్ర జలాలు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పొలాల్లో ఉన్న వరి కుప్పలను రక్షించుకునేలా రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తీవ్ర తుఫానుతో భారీ నష్టం ఉంటుందని ప్రభుత్వ శాఖలను ఐఎండీ అప్రమత్తం చేసింది. దీంతో ఖరీఫ్‌లో వేసిన వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు వ్యవసాయ శాఖ సూచించింది. 

తీవ్ర తుఫాన్‌ విశాఖకు అతి సమీపంగా వచ్చి, తరువాత దిశ మార్చుకుంటుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వారి అంచనా ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర తుఫాన్‌ విశాఖ, కాకినాడ మధ్య తీరానికి 40-50 కిలోమీటర్ల దూరంలోకి రానుంది. ఆ తరువాత ఉత్తరంగా, ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తీరానికి ఆనుకుని పయనిస్తుంది. గోపాలపూర్‌, పూరి పరిసరాల్లో తీరం దాటుతుంది. అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్‌ వైపు పయనిస్తుంది. ఒకవేళ తీవ్ర తుఫాన్‌ మధ్య బంగాళాఖాతంలో ఉన్నప్పుడే మరింత బలపడితే మాత్రం...తీరానికి దగ్గరగా రాకముందే దిశ మార్చుకుంటుందని చెబుతున్నారు. తీవ్ర తుఫాన్‌ తీరానికి 200 కిలోమీటర్ల దూరానికి వచ్చేసరికి మరింత బలపడుతుందని కొన్ని మోడల్స్‌ చెబుతున్నాయి. దీనిపై గురువారం నాటికి మరింత స్పష్టత వస్తుందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు పేర్కొన్నారు.