హెలికాఫ్టర్ కూలి భక్తులు సజీవదహనం..
posted on Nov 23, 2015 2:31PM

జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దైవ దర్శనం కోసం బయలుదేరిన భక్తులు సజీవదహనమయ్యారు. వివరాల ప్రకారం.. కాట్రాకు సమీపంలో ప్రసిద్ధి చెందిన వైష్ణోదేవి ఆలయంలో దైవదర్శనం చేసుకోవడానికి జమ్మూ నుంచి ప్రతి రోజు చాలా మంది భక్తులు వెళుతుంటారు. అయితే దీనికి హెలికాప్టర్ సర్వీసులు మాత్రమే ఉన్నాయి. ఎప్పటిలాగే ఈరోజు కూడా దైవదర్శనార్ధం ఐదుగురు భక్తులు, ఇద్దరు సిబ్బంది కలిసి జమ్మూ నుంచి వైష్ణోదేవి ఆలయం దగ్గరకు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలోకి వెళ్లేసరికి హెలికాఫ్టర్ అదుపుతప్పి కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్ లో ఉన్న ఐదుగురు భక్తులతో పాటు ఇద్దరు సిబ్బంది కూడా సజీవదహనమయ్యారు. మరణించిన భక్తుల వివరాలు సేకరిస్తున్నామని, హెలికాప్టర్ కూలిపోవడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు తెలిపారు.