జైరామ్ దెబ్బకి టీ-కాంగ్రెస్ కూడా మటాష్?

 

పార్లమెంటులో విభజన బిల్లుకి ఆమోదముద్ర పడగానే కేంద్రమంత్రి జైరామ్ రమేష్ రెక్కలు కట్టుకొని ఎగిరి వచ్చి రాష్ట్రం మీద చక్కర్లు కొడుతూ ఆంధ్ర, తెలంగాణా ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దిగ్విజయ్ సింగ్ ఇన్-చార్జ్ అయినప్పటికీ ఇప్పుడు జైరామ్ రమేషే ఇన్-చార్జ్ అన్నట్లుగా వ్యవహరిస్తూ, ఆంధ్ర, తెలంగాణాలలో పార్టీని తీవ్ర ప్రభావితం చేసే విదంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాకు దళితుడనే ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఇంత కీలకమయిన నిర్ణయాలను ఈవిధంగా ప్రకటించ(లే)దు. కానీ, జైరామ్ రమేష్ ప్రకటించారంటే బహుశః అందుకు అధిష్టాన దేవత అనుమతించి ఉండవచ్చును.

 

తెలంగాణా ఇస్తే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పడమే కాకుండా, కనీసం పొత్తులకయినా కాంగ్రెస్ ను కనికరించకుండా, తామే స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బల్లగుద్ది చెపుతూ కాంగ్రెస్ కంట్లో నలుసుగా తయారయ్యారు. అంతే గాక తెలంగాణా ఏర్పడితే మొదట దళితుడనే ముఖ్యమంత్రి ని చేస్తానని చెపుతూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు. పైగా తనపార్టీ నేతలచేత తనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టి తెలంగాణా పునర్నిర్మాణం చేయాలని గట్టిగా డిమాండ్ చేయిస్తున్నారు. అందువలన ఇప్పుడు కేసీఆర్ ని అతని పార్టీని తెలంగాణా ప్రజల దృష్టిలో పలుచన చేసేందుకే బహుశః జైరామ్ రమేష్, ఇప్పుడు ‘దళిత ముఖ్యమంత్రి’ అంశం తలకెత్తుకొన్నారు. అయితే తెలంగాణా ఏర్పాటు చేసి, తెరాసను విలీనం చేసుకొని, తెదేపా, బీజేపీలను దెబ్బతీసి రాజకీయ లబ్ది పొందాలని కలలుగన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు జైరామ్ రమేష్ తాజా ప్రకటనతో మరొకసారి తన కాళ్ళను తానే నరుకొన్నట్లుగా అయింది.

 

తెలంగాణా ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి అవ్వాలని కలలుగంటున్న డజనుకు పైగా ఉన్న టీ-కాంగ్రెస్ నేతల ఆశలపై జైరామ్ రమేష్ ప్రకటన నీళ్ళు చల్లినట్లయింది. వారందరూ ఇంతవరకు కేవలం ముఖ్యమంత్రి పదవికోసమే సోనియా భజన చేస్తున్నారని అందుకే తెరాసతో పొత్తులు వద్దంటున్నారని కూడా అందరికీ తెలుసు. కానీ కేసీఆర్ ని ఇరుకునపెట్టే ప్రయత్నంలో జైరామ్ రమేష్ మాట్లాడిన మాటలు వారికి తీవ్ర ఆగ్రహం కలిగించాయి. ఇంతవరకు ఆయనను అంటిబెట్టుకొని తిరిగిన టీ-కాంగ్రెస్ నేతలందరూ ఇప్పుడు ఆయనపై అధిష్టానానికి పిర్యాదు చేసేందుకు సిద్దం అవుతున్నారు.

 

అయితే శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు. సోనియమ్మ ఆదేశం లేనిదే జైరామ్ రమేష్ అయినా ఆవిధంగా మాట్లాడరు అనే తత్వం వారు గ్రహించలేకపోవడం విచిత్రమే. అయినా రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడం కోసం తన సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీని, నేతల రాజకీయ భవిష్యత్తుని కూడా బలిపెట్టగలిగిన కాంగ్రెస్ అధిష్టానం, అవసరమనుకొంటే టీ-కాంగ్రెస్ నేతలను (కేసీఆర్ కి) బలి ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతుంది? అనే ఆలోచన కూడా వారికి లేకపోవడం విచిత్రమే.