నేడు జగన్నాథుని నేత్రోత్సవం

 

జగన్నాటక సూత్రధారి జగన్నాథుడు కోలుకున్నాడు. గురువారం (26వ తేదీన) నవయవ్వన రూపంతో భక్తులకు దర్శనం ఈయనున్నాడు. శుక్లపక్షమి పాడ్యమి తిథి పర్వదినం పురస్కరించుకుని గురువారం బ్రహ్మాండనాయకుని నేత్రోత్సవం పూరీ శ్రీక్షేత్రంలో నిర్వహించనున్నారు. కాగా పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర శుక్రవారం (27న) నిర్వహించనున్నారు. నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలు నేడు శ్రీక్షేత్రం ఎదుట కార్డన్ కు చేరుకోనున్నాయి.

స్వామి రాక కోసం శ్రీ మందిరం గడపలో మూడు రథాలు దేవతల ఆగమనం కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. ఇటు శ్రీ మందిరం, అటు శ్రీ గుండిచా మందిరం వాకిళ్ళు మొదలుకొని ఆలయ ప్రాంగణాలు సైతం శోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. గుండిచా మందిరంలో అడపా మండపం చతుర్థాదారు మూర్తుల ఆసీనం కోసం సిద్ధమై ఉంది. భారీ రంగవళ్లులతో రెండు మందిరాల వాకిళ్లు మిరమిట్లు గొలిపిస్తున్నాయి