కేసీఆర్ బాటలో జగన్..! ప్రజలపై పెనుభారం మోపేందుకు అడుగులు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అనుసరిస్తున్నట్లే అనిపిస్తుంది. రైతుబంధు మాదిరిగా రైతు భరోసా... కంటి వెలుగు... ఇలా కొన్ని పథకాల్లో సారూప్యత కనిపిస్తుంది. ఇక, ఆర్టీసీ విషయంలో కేసీఆర్ బాటలోనే జగన్ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న జగన్ నిర్ణయమే తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు దారి తీసింది. చివరికి కార్మికులు ఏమీ సాధించలేక చేతులెత్తేస్తే ప్రభుత్వం మాత్రం ప్రజలపై ఛార్జీల భారం మోపింది. అయితే, తెలంగాణ బాటలోనే ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచేందుకు సిద్ధమవుతోంది. నష్టాలను పూడ్చుకునేందుకు తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలను పెంచడంతో ఏపీలోనూ ఫాలో కావాలని దాదాపు నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్టీసీకి ఏటా వెయ్యి కోట్లకు పైగా నష్టాలు వస్తున్నాయి. డీజిల్ ధరలు పెనుభారంగా మారడంతో ఎప్పట్నుంచో ఛార్జీలు పెంచాలని ఏపీఎస్-ఆర్టీసీ కోరుతోంది. కానీ, నాలుగైదు ఏళ్లుగా ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. ప్రయాణికులపై భారం మోపకుండానే... ఇతర మార్గాల్లో ఆదాయం పెంచుకోవాలని చెబుతూ వచ్చింది. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఏపీఎస్-ఆర్టీసీ కూడా ఆక్యుపెన్సీ రేషియోను క్రమంగా 82శాతానికి  పెంచుకుంటూ వచ్చింది. అలాగే, సరుకు రవాణా ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇంత చేస్తున్నప్పటికినీ నష్టాలు మాత్రం తప్పడం లేదు.

అయితే, అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ సర్కారు ప్రకటించడంతో కార్మికులకు భారీ ఊరట లభించినా... అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ఛార్జీలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, ఆర్టీసీతోపాటు ప్రైవేట్ బస్సుల ఛార్జీల నియంత్రణ కోసం ప్రత్యేక రెగ్యులేటరీ కమిషన్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూనే... మరోవైపు ప్రయాణికులపై భారం వేసేందుకు అడుగులు వేయడం సరికాదంటున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆర్టీసీ కార్మికుల జీతాల భారాన్ని ప్రభుత్వమే తీసుకుంటున్నప్పుడు... ఇక ఛార్జీలు పెంచాల్సిన అవసరమేంటని అంటున్నారు.