మళ్లీ లక్ష్మణ్ కే టీబీజేపీ పగ్గాలు..! ఏపీలో మాత్రం వాళ్లిద్దరిలో ఒకరు..!

తెలంగాణ బీజేపీ పగ్గాలు మళ్లీ లక్ష్మణ్ కే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జితేందర్ రెడ్డి, డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తదితరులు టీబీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించినప్పటికీ... బీజేపీ అధిష్టానం మాత్రం మళ్లీ లక్ష్మణ్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఇటీవల జితేందర్ రెడ్డి.... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవడంతో తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చని ప్రచారం జరిగింది. అయితే, తెలంగాణ సామాజిక పరిస్థితులపై లెక్కలేసిన బీజేపీ అగ్రనాయకత్వం లక్ష్మణ్ ను కొనసాగించడమే పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చాయట. దాంతో, తెలంగాణ బీజేపీ పగ్గాలు మరోసారి లక్ష్మణ్ కే దక్కనున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను మార్చబోతున్నారనే మాట ఎప్పట్నుంచో వినిపిస్తోంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒకరికి బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం జరిగింది. అయితే, కన్నాను మార్చితే... బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కి గానీ... ఎమ్మెల్సీ విష్ణువర్దన్ రెడ్డికి కానీ ఏపీ బీజేపీ పగ్గాలు ఇస్తారని అంటున్నారు.