క్లైమాక్స్ కు చేరిన వైఎస్ కుటుంబ రాజకీయం.. జగన్ కు అవినాష్ దెబ్బ గట్టిగానే తగులుతుందా?!

 ఏపీలో ఎన్నికల తేదీ రోజుల్లోకి వచ్చేసింది. కచ్చితంగా చెప్పాలంటే మరో 14 రోజుల్లో ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల హీట్ రోహిణీకార్తె ఎండలను మించిపోయింది. పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలైపోయి ఉన్నాయి. పార్టీల అధినేతలు బహిరంగ సభలు, రోడ్ షోలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత వేరే లెవెల్ లో కనిపిస్తోంది. దీంతో అధికార వైసీపీలో ఓటమి భయం కూడా స్పష్టంగా కానవస్తోంది.

రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే.. కడప జిల్లా ఒక్కటీ ఒకెత్తు అన్నట్లుగా ఇక్కడ అధికార వైసీపీ ఆధిపత్యం కానవచ్చేది. అయితే ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కడప లోక్ సభ బరిలో అవినాష్ కు పోటీగా కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిల రంగంలోకి దిగడంతోనే కడపలో సీన్ మారిపోయింది. షర్మిల ప్రజెన్స్ ఒక్క కడప లోక్ సభ నియోజకవర్గాన్నే కాకుండా ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ, మొత్తం జిల్లాపైనా ప్రభావం చూపుతోంది. అన్నిటికీ మించి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఈ ఎన్నికలలో జిల్లా వ్యాప్తంగా ప్రధాన అజెండాగా మారిపోయింది. 

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. ఇప్పటి రాజకీయాలను బట్టి చూస్తే ఇది చాలా తక్కువ సమయం. అందుకే   ఇప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చిన్నాన్న  వైఎస్ వివేకానంద రెడ్డి 2019 ఎన్నికలకు ముందు హత్యకు గురైన సంగతి తెలిసిందే.  హత్యకు గురైన వివేకా ఇంట్లోనే ఇప్పుడు అధికారం ఉంది. హత్య  తెలుగుదేశం హయంలో జరగడం, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు.. ఆ హత్య వెనుక ఉన్నది తెలుగుదేశంఅన్నట్లుగా ఫోకస్ చేసి లబ్ధి పొందారు ఇప్పుడు అదే కేసు విచారణకు వచ్చేసరికి నాడు లబ్ధి చేకూర్చిన కేసే ఇప్పుడు వారికి రివర్స్ లో నష్టం చేకూర్చేలా మారిపోయింది.

ఇప్పటికే ఎన్నో మలుపులు, అంతకి మించి కుదుపులు చోటు చేసుకున్న వివేకా హత్యకేసు క్లైమాక్స్ చేరింది. ఈ హత్య కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. కోర్టుల్లో తీర్పులూ ఇంకా రాలేదు. కానీ ఈ కేసులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న విషయంలో ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది. ఇప్పుడు వివేకా హత్య కేసులో కడప ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఎన్నికలలో ఓటు ద్వారా తమ తీర్పు ఏమిటో చెప్పనున్నారు. అందుకే  వివేకా హత్య కేసు  క్లైమాక్స్ కి చేరిందని అంటున్నారు.  కోర్టుల్లో వివేకా హత్య కేసు సాగదీత కోసం   ఓ వర్గం సర్వశక్తులు ఒడ్డింది. అది  తెలుగు రాష్ట్రాల  ప్రజలు   చూస్తూనే ఉన్నారు. కడప జిల్లా వాసులు అయితే చూడటం తో  పాటు హత్య కు కారకులు, కారణాలు కూడా అర్ధం చేసుకున్నారు.  నిన్న మొన్నటి వరకు ఈ కేసు సాగదీతలో కేంద్రం అంతో ఇంతో సాయపడుతుందని ఢిల్లీ నుండి గల్లీ వరకూ కోడై కూసింది. విశ్లేషకుల నుండి అతి సామాన్య ప్రజల వరకూ అందరి నోటా ఈ మాటే వినిపించింది. అయితే, ఇప్పుడు కేంద్రంలో పరిస్థితులు కూడా మారిపోయాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు పాత మిత్రుల అవసరం వచ్చింది పడింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల పుణ్యమా అని అని దేశవ్యాప్తంగా బీజేపీ పాత మిత్రులను దగ్గరకు చేర్చుకుంది. అలాగే ఏపీలో కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది.  ఈక్రమంలో ఇకపై వివేకా కేసులో కేంద్రం నుండి సాయం అంటే వైసీపీకి ఎడారిలో నీటి ఊటను వెతుక్కోవడమే అవుతుంది. దీంతో ఇప్పుడు వివేకా హత్య కేసు కడప జిల్లాలో ప్రధాన ఎన్నికల అజెండాగా మారిపోయింది. 
సరిగ్గా గత ఎన్నికల సమయంలో వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన  వివేకా హత్యకేసు ఇప్పుడు  వైసీపీకి ఊపిరాడకుండా చేస్తోంది.  రాజకోట లాంటి ఇంట్లో అతి కిరాతకంగా జరిగిన ఈ హత్యను వారికి తగ్గట్లుగా మలుచుకోవడంలో వైఎస్ జగన్ అప్పుడు సక్సెస్ అయ్యారు. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయానికి అదే కేసు వైసీపీ వెన్నులో వణుకుపుట్టిస్తోంది.  

నిజానికి ఈ హత్య ఎవరు చేశారు.. ఎవరు చేయించారు అనేది కోర్టులు, శిక్షలకే పరిమితం. కానీ, రాజకీయాలలో చేసే ఆరోపణలలో బలం ఎటువైపు ఉంటే ప్రజలు అదే నమ్మే ఛాన్స్ ఉంటుంది. ఆ లెక్కన ఈ కేసులో దాదాపు ఐదేళ్ల విచారణ, అప్పటి నుండి జరిగిన పరిణామాలు అన్నీ కూడా  తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా  ఉన్నాయి. ఈ కేసులో ప్రధానంగా సీఎం జగన్ కు మరో చిన్నాన్న కొడుకైన ఎంపీ అవినాష్  కీలక సూత్రధారిగా దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటికే తేల్చి చెప్పడం సీఎంకు ఎన్నికలలో కచ్చితంగా ప్రతికూలాంశంగా మారిందనడంలో సందేహం లేదు. దానికి తోడు వివేకా కుమార్తె సునీత, సీఎం జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల.. వివేకా హంతకుల పక్కన నిలబడిన సీఎంకు ఓటు వేయవద్దు, వైసీపీని ఓడించండి అంటూ చేస్తున్న ప్రచారం కడప వాసులను కదిలిస్తోంది.  ఈ కేసులో అవినాష్ తప్పించుకునేందుకు జగన్ పడుతున్న తాపత్రయం, ఎన్నికల ప్రచారంలో కోర్టుల తీర్పులతో పని లేకుండా జగన్ అవినాష్ కు క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజలలో జగన్ పట్ల, ఆయన ప్రభుత్వం పట్ల ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. అందులో భాగమే పులివెందులలో జగన్ తరఫున ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి భారతికి ఎదురౌతున్న చేదు అనుభవాలు. ప్రజల నుంచి ఎదురౌతున్న ప్రశ్నలు. వీటన్నిటినీ బట్టి చూస్తే  ఎన్నికలలో వైసీపీకి  కడపలో కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ వ్యతిరేక పవనాలకు జగన్ అవినాష్ ను వెనకేసుకురావడమే కారణమంటున్నారు. అంటే కడప కహానీ క్లైమాక్స్ చేరిందనీ, జగన్ కు అవినాష్ నుంచే గట్టి దెబ్బతగిలినట్లు కనిపిస్తోందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.