నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీకి గల్ఫ్ కార్మికుల బహిరంగ లేఖ !

గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే ముందు... నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఈ  ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ  గల్ఫ్ జెఏసి చైర్మన్, గుగ్గిల్ల రవిగౌడ్ బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు.  ◉ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఏం చర్యలు తీసుకుంది?   ◉ గత ఐదేళ్లలో గల్ఫ్ సమస్యల గురించి పార్లమెంటులో మీరు ఎందుకు మాట్లాడలేదు? ◉ గల్ఫ్ దేశాలలో భారతీయ కార్మికులకు అక్కడ కంపెనీలు ఇస్తున్న కనీస వేతనాలను... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ  సెప్టెంబర్ 2020 లో రెండు సర్కులర్లను జారీ చేసింది. ఇందులో కేంద్రం జేబులోంచి ఇచ్చేది ఏముండదు. గల్ఫ్ దేశాల కంపెనీలు జీతాలు ఇస్తాయి... కార్మికులు తీసుకుంటారు. అరవింద్ గారు... గల్ఫ్ దేశాలలో పనిచేసే 88 లక్షల మంది భారతీయ కార్మికుల జీవితాలకు సంబంధించిన ఈ అంశంపై మీరు ఎందుకు స్పందించలేదు. ఎందుకు పార్లమెంటులో మాట్లాడలేదు. మేము చేసిన ఉద్యమ ఒత్తిడికి తలొగ్గిన  కేంద్ర ప్రభుత్వం 10 నెలల తర్వాత పాత వేతనాలను కొనసాగిస్తామని ప్రకటించింది.  ◉ ప్రవాసి భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమాలో సహజ మరణాన్ని కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎందుకు పట్టించుకోలేదు.  ◉ హైదరాబాద్ లో సౌదీ అరేబియా మరియు కువైట్ దేశాల కాన్సులేట్లు (దౌత్య కార్యాలయాలు) ఏర్పాటు కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదు. ◉ ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో చాలా సార్లు పర్యటించారు. భారత్ - గల్ఫ్ దేశాల మధ్య చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువ. గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం గురించి ఎందుకు  పట్టించుకోలేదు.  ◉ కరోనా కష్టకాలంలో గల్ఫ్ తదితర దేశాల నుంచి భారత్ కు వాపస్ వచ్చిన ప్రయాణీకుల నుంచి వందే భారత్ ప్లయిట్స్ లలో రెండింతలు, చార్టర్డ్ ఫ్లయిట్స్ లలో మూడింతలు విమాన ఛార్జీలు వసూలు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రవాసి కార్మికులను ఎందుకు దోచుకున్నది.  ◉ 34 సంవత్సరాల క్రితం...1990 లో కువైట్ పై ఇరాక్ దురాక్రమణ 'గల్ఫ్ యుద్ధం' జరిగిన సందర్బంగా అప్పటి భారత ప్రధాని వి.పి. సింగ్, విదేశాంగ మంత్రి ఐ.కె. గుజ్రాల్ నాయకత్వంలో ఒక లక్షా 70 వేల మంది భారతీయులను ఉచితంగా స్వదేశానికి తరలించారు. వి.పి. సింగ్ లాగా ఇప్పటి ప్రధాని మోదీ ఎందుకు ఉచితంగా విమానాలను ఏర్పాటు చేయలేకపోయారు.  ◉ గల్ఫ్ దేశాలలో ఉన్న వలస కార్మికులు ఈ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం స్వయంగా ఇండియాకు రావడం వీలుకాదు. ప్లయిట్ చార్జీలు భరించడం, లీవ్ దొరకడం కష్టం. గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం... ఎన్నారైలకు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం -  ఆన్ లైన్ ఓటింగ్ ఓటింగ్ సౌకర్యం కల్పించలేకపోయింది. 'ఆబ్సెంటీ ఓటర్స్' గా మిగిలిపోతున్న గల్ఫ్ కార్మికులకు మీరు ఇచ్చే జవాబు ఏమిటి? ◉ బీజేపీ మోదీ ప్రభుత్వం ఆన్ లైన్ ఓటింగ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది. మోదీకి ఎన్నారైలు అంటే... ఏదో తెలియని భయం పట్టుకున్నదా? ◉ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు 2023లో 125 బిలియన్ యుఎస్ డాలర్లు (10 లక్షల 25 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారకాన్ని భారత్ కు పంపారు. ఇందులో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే లభిస్తున్నది. దేశానికి ఆర్థిక జవాన్లుగా పనిచేస్తున్న ప్రవాసులకు కేంద్రం అన్యాయం చేస్తోందని అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీనికి మీ జవాబు ఏమిటి? ◉ బంగ్లాదేశ్ పౌరులు విదేశాల నుంచి పంపిన విదేశీ మారక ద్రవ్యంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం రెండున శాతం ప్రోత్సాహకం  ఇస్తున్నది. భారత్ ఎందుకు ఇవ్వడం లేదో ఏనాడైనా ఆలోచించారా.  ◉ "ఇవాళ దుబాయిలో మనవాళ్ళు చేతికి కంకణం కట్టుకొని, నొదుట బొట్టు పెట్టుకొని, తిలకం దిద్దుకొని తిరుగుతున్నరు అంటే... దానికి నరేంద్ర మోదీ గారే కారణం" అని ఇటీవల నిజామాబాద్ ఎంపీ అరవింద్  వ్యాఖ్యానించడం ఘోర తప్పిదం.. సర్వ స్వతంత్ర, సార్వభౌమాధికారం కలిగిన దుబాయి (యూఏఈ దేశం) పై భారత్ ఆధిపత్యం చలాయిస్తున్నది అనే అర్థం వచ్చేలా మాట్లాడటం దౌత్య నిబంధనలకు విరుద్ధం. దీనిపై మీ జవాబు ఏమిటి.  ◉ దుబాయిలో, మస్కట్, బహరేన్ లలో వంద సంవత్సరాలకు పూర్వమే హిందూ మందిరాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా.  ◉ ఇలాంటి వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై చిచ్చు పెట్టి ఈ పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందాలని చూడటం ఎంతవరకు కరెక్ట్. ఇలాంటి మాటల వలన దుబాయి, యూఏఈ దేశంలో మన ప్రవాస భారతీయుల ఉద్యోగ అవకాశాలపై దెబ్బ పడితే ఎవరు బాధ్యత వహిస్తారు.  ◉ ఎమిగ్రేషన్ యాక్టు1983 అనే విదేశీ వలసల నియంత్రణ చట్టం స్థానంలో... కొత్త చట్టం తేవాలనే ప్రతిపాదనలను గత ఐదేళ్లుగా బీజేపీ ఎందుకు పెండింగ్ లో పెట్టిందని గ‌ల్ఫ్ జేఏసి నిల‌దీస్తోంది.  రైతులు, బీడీ కార్మికులు, గల్ఫ్‌ కార్మికులు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ నియోజకవర్గం ఓట‌ర్లు, ప్రతిసారీ విలక్షణ తీర్పునే ఇస్తుంటారు. గ‌ల్ప్ కార్మికులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారి కుటుంబ స‌భ్యులు ఎటు మొగ్గితే వారే విజయాన్ని సాధిస్తున్నారు. ఎంపీ హోదాలో అర‌వింద్  ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో గ‌ల్ప్ కార్మికుల కుటుంబాలు బీజేపీపై కోపంతో ఉన్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 29, 2024 5:16PM

జ‌గ‌న్ సంపాద‌న‌ను, నా సంపాద‌న‌తో పోల్చ‌వ‌ద్దుః పెమ్మ‌సాని

దేశంలోనే అత్యంత రిచెస్ట్ సి.ఎం.గా  జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ఎంపీ అభ్య‌ర్థుల్లో ధ‌న‌వంతుడు గా పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. ఈ ఇద్ద‌రి గురించి దేశ‌వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంపాద‌న‌ను, నా సంపాద‌న‌తో పోల్చ‌వ‌ద్దు. ఆయ‌నది అక్ర‌మ సంపాద‌న అని  సీబీఐ చెబుతోంది. నాది అలా కాదు. నేను ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాయించుకున్నా. సో.. ఆయ‌న‌తో న‌న్ను పోల్చ‌వ‌ద్దంటున్నారు పెమ్మసాని చంద్రశేఖర్.  కష్టపడి ఈ స్థాయికి వచ్చిన నన్ను, జగన్‌తో పోల్చొద్దంటారు. తాను 2001లో బిజినెస్ ప్రారంభించి.. 24 ఏళ్లలో ఈ స్థాయికి ఎదిగానని పెమ్మసాని స్పష్టం చేశారు. 30 ఏళ్లు కష్టపడి, అమెరికాలో 40 శాతం పన్ను కడితే ఈ స్థాయికి వచ్చానని ఆయ‌న చెప్పారు. క్విడ్ ప్రోకో ద్వారా రాత్రికి రాత్రే ఎదిగిన జ‌గ‌న్‌కు, త‌న‌కు పోలికే లేదంటారు. జ‌గ‌న్‌ తండ్రి నీడ‌లో కష్టపడకుండా ఎదిగిన జ‌గ‌న్‌కు త‌న‌కు పోలికే లేదని తేల్చి ప‌డేశారు. 2004లో ఆయన ఆస్తి కోటి రూపాయిలు ఉంది.  క్విడ్ ప్రోకో చేసి దాని మీద వైయస్ జగన్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో తనకు, వైయస్ జగన్‌కు కంప్లీట్ డిఫరెంట్ ఉందంటారు పెమ్మ‌సాని.  ఎన్నిక‌ల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో పెమ్మ‌సాని తన ఆస్తుల విలువ రూ.5,705 కోట్లుగా ప్రకటించారు. దీంతో  ఆయన గురించి చ‌ర్చ మొద‌లైంది. ఆయన ఎవరు.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి.. ఏమి చేసి ఈ స్థాయికి ఎదిగారు అని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.   పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఇంటర్మిడియట్‌లో రోజుకు 15 నుంచి 16 గంటలపాటు కష్టపడి చదివి, ఆ క్రమంలో 27 ర్యాంక్ సాధించారు. హైదరాబాద్‌ ఉస్మానియాలో సీటు సంపాదించారు. ఇలా ఉస్మానియాలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్... పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000 సంవత్సరంలో అమెరికాకు వెళ్లారు. అక్కడ... పీజీ పూర్తి చేసిన అనంతరం.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీగా ఐదేళ్లపాటు కొనసాగారు. ఇదే సమయంలో... మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సహాయం చేసేవారు.  ఇందులో భాగంగా... తాను సొంతంగా తయారు చేసిన నోట్స్‌ ను తక్కువ ధరకు ఆన్ లైన్‌ లో అందించేవారు.  ఆయన రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో... విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ ఆన్‌ లైన్‌ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించి.. ఫార్మసీ, నర్సింగ్‌, లా, ఫైనాన్స్, అకౌంటింగ్‌ విభాగాల్లో లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక యువ వ్యాపారవేత్తగా ఎదిగారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఈ వ్యాపారం ద్వారా ఆయన కోట్ల రూపాయిలను సంపాదించారు!  అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక ఎంటర్ పెనియర్‌గా  ఎదిగారు. అమెరికాలో ఉన్న తన కంపెనీలలో ఎంతో మంది తెలుగు వారికి జబ్స్ ఇచ్చారు. 30 ఏళ్ళుగా అమెరికాలో ఉన్నప్ప‌టికీ.. అక్క‌డ గ్రీన్ కార్డు కోసం అప్ల‌య్ చేయలేదు.  త‌న ద‌గ్గ‌ర డ‌బ్బుంద‌ని ఎన్నిక‌ల పోటీ చేస్తున్నాన‌ని చెప్ప‌డం క‌రెక్ట్ కాదు. అవ‌కాశం వ‌చ్చింది కాబ‌ట్టి త‌న జ‌న్మ‌భూమికి  ఏమైనా చేయాల‌న్న ఉద్దేశంతోనే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చంద్ర‌శేఖ‌ర్ చెబుతున్నారు.   వైఎస్ వార‌సుడిగా వ‌చ్చిన జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి  ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆయ‌న‌ ఆస్తులు రూ.750 కోట్లు. ఆయ‌న‌పై  26 కేసులు ఉన్నాయి.  11 సీబీఐ, 9 ఈడీ కేసులు ఉన్నాయి. మ‌రో 6 ఇత‌ర కేసులు ఉన్నాయి. అక్రమంగా ఆస్తులు కూడగట్టారనే అభియోగం కింద 2012 మే 27న సీబీఐ.. జగన్‌ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు జ‌గ‌న్ చంచ‌ల్ గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబర్2లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  జ‌గ‌న్ అన్ అఫీషియ‌ల్‌గా మోదీతో అండ‌ర్‌స్టాండింగ్‌, అవ‌గాహ‌న‌తో వున్నారు. అందుకే ఆయ‌న కేసుల విష‌యంలో క‌నీసం అఫిడ‌విట్ వేయ‌కుండా సిబిఐ సాగ‌దీస్తోంది. జ‌గ‌న్‌, ఎన్‌డిఏలో లేక‌పోయినా, త‌న‌ ప్ర‌త్యర్థి టీడీపీతో బీజేపీ క‌లిసిన జ‌గ‌న్ స‌పోర్ట్ బిజెపికే.  జ‌గ‌న్ ప‌రోక్ష స్నేహ‌సంబంధాలే గ‌త 10 ఏళ్ళ గా కేసుల్ని ప‌ట్టించుకోవ‌పోవ‌డానికి కారణం.  రాజశేఖర్‌రెడ్డి చనిపోయినపుడు రిలయన్స్‌ వారే చంపించారంటూ వాళ్ల పెట్రోల్‌ బంకులను దహనం చేసి.. ఎంతోమంది అమాయకులు బలైపోవడానికి కారణమయిన జగన్‌.. ముఖ్యమంత్రి అయ్యాక అంబానీ అనుచరుడికి రాజ్యసభ సీటు ఇచ్చారు. తన నాన్నను కాంగ్రెస్‌ వాళ్లే సీబీఐ కేసులో ఇరికించారని చెప్పిన జగన్‌, తన లాయర్‌ ద్వారా జ‌గ‌నే, వైఎస్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చేలా చేశారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 29, 2024 4:50PM

రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు 

తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి.తెలంగాణ  పిసిసి అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కాంగ్రెస్ , బిజెపి నేతల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణల పర్వానికి శ్రీకారం చుట్టారు.   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు గాంధీ భవన్‌కు వెళ్లారు. మే 1న ఫోన్ తీసుకొని విచారణకు రావాలని పోలీసులు తెలిపారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా చెప్పినట్లుగా ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోందని ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు పలురాష్ట్రాల్లో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. వీడియో షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ట్విట్టర్ హ్యాండిల్స్‌కు నోటీసులు జారీ చేశారు.ఈ ఫేక్ వీడియోను ఎవరు తయారు చేశారన్న దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేపట్టింది. ఈ ఫేక్ వీడియోలు ఝార్ఖండ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.
Publish Date: Apr 29, 2024 4:50PM

జగన్, కేటీఆర్ నోట ఉమ్మడి రాజధాని మాట.. వ్యూహత్మకమా.. కాకతాళీయమా?

ఎన్నికల వేళ  ప్రచారంలో పై చేయి సాధించడానికి రాజకీయ నాయకులు, పార్టీలూ రోజు కో వ్యూహంతో ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. లోక్ సభ ఎన్నికలలోనైనా పుంజుకుని ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ డిస్పరేట్ గా తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రగిల్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఏపీలో అయితే ఐదేళ్ల అస్తవ్యస్థ పాలనతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ మరోసారి అధికారంలోకి రావడానికి ఏం చేయాలో అర్ధం కాక మల్లగుల్లాలు పడుతోంది.  ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాజధాని విషయంపై అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ గళమెత్తుతున్నాయి. ఇది కాకతాళీయమా లేక ఉమ్మడి వ్యూహమా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను ఎన్నికల అంశంగా తెరమీదకు తేవడం ద్వారా తెలంగాణ సెంటిమెంటును రగిల్చి ప్రజల మనస్సులను గెలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. మరో వైపు ఇదే ఉమ్మడి రాజధాని అంశాన్ని వైసీపీ లేవనెత్తడం ద్వారా రాజధాని లేని  రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడానికి జగన్ సర్కార్ కారణమన్న విమర్శ నుంచి బయటపడవచ్చన్నది వైసీపీ భావనగా కనిపిస్తోంది. రెండూ పార్టీల నుంచీ ఒకే వాదన ఒకే సారి తెరమీదకు రావడమే ఇక్కడ అనుమానాలకు తావిస్తున్నది. ఎందుకంటే వైసీపీ, బీఆర్ఎస్ లు రెండూ ఫ్రెండ్లీ పార్టీలు. పరస్పరం సహకారం అందిం చుకుం టుంటాయి. గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  ఏపీ సీఎం జగన్ రెడ్డి మిత్రుడు కేసీఆర్ కోసం సరిగ్గా పోలింగ్ తేదీకి ముందు రోజు అర్ధరాత్రి నాగార్జున సాగర్ డ్యాం వద్దకు ఏపీ పోలీసులను పంపించారు. అది కేసీఆర్ కు పెద్దగా ఉపయోగపడలేదు అది వేరే విషయం. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ లబ్ధి కోసం కేసీఆర్, కేటీఆర్ లు ఏపీలో మళ్లీ జగన్ సర్కారే కొలువుదీరనున్నదని జోస్యాలు చెబుతున్నారు. ఇది జగన్ కు ఎంత వరకూ ఉపయోగపడుతుందన్నది వేరే సంగతి. పరస్పర సహకారం కోసం రెండు పార్టీలూ, రెండు పార్టీల అధినేతల తహతహలాడుతున్నాయన్నది మాత్రం వాస్తవం. కారణమేమిటంటే రెండు రాష్ట్రాలలోనూ ఏకకాలంలో ఇాద్దరు శత్రువులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు) ముఖ్యమంత్రులుగా ఉండటం ఇరువురికీ ఇబ్బంది కరమైన విషయమే అనడంలో సందేహం లేదు. ఆ కారణంగానే  వేములవాడలో జరిగిన పార్టీ సమావేశంలో ఆదివారం (ఏప్రిల్ 28) మాట్లాడిన కేటీఆర్ బీఆర్ఎస్ సభ్యులు లోక్ సభలో ఉండటం తెలంగాణకు అవసరం అన్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా బీఆర్ఎస్ మాత్రమే నిలువరించగలదని అన్నారు.  మరో వైపు సోమవారం (ఏప్రిల్ 29)చోడవరంలో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను చంద్రబాబు కారణంగా దూరం చేసుకున్నామని పేర్కొన్నారు. అసలు ఉమ్మడి రాజధాని ముగిసిన అంశం. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ బీఆర్ఎస్, వైసీపీలు ఈ అంశాన్ని లేవనెత్తడం కాకతాళీయమేనా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జూన్ 2, 2024తో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో  బీఆర్ఎస్, వైసీపీలు కూడబలుక్కునే ఉమ్మడి రాజధాని అంశాన్ని వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకువచ్చాయని అటున్నారు.  ఏకకాలంలో అటు బీఆర్ఎస్ కూ, ఇటు వైసీపీకీ ఉమ్మడి రాజధాని అంశం గుర్తుకురావడంపై అటూ ఇటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి రాజధానిని ఆపగలిగేది బీఆర్ఎస్ మాత్రమే అం టూ బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణలో  తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్యా విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలేమిటన్న విమర్శలు వస్తుంటే.. అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి, మూడు రాజధానులంటూ ఒక్క రాజధానిని కూడా కట్టలేకపోయిన జగన్ ఇప్పుడు ఉమ్మడి రాజధాని గురించి మాట్లాడడమేమిటని నిలదీస్తున్నారు. మొత్తం రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్, వైసీపీలు  వ్యూహాత్మకంగానే ఉమ్మడి రాజధాని అంశాన్ని లేవనెత్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Apr 29, 2024 4:28PM

జగన్ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు ...ఇసుక మాఫియాపై కన్నెర్ర

ఎపిలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. వైకాపా హాయంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. సహజవనరులను సైతం కొల్లగట్టడంతో ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. అధికారపార్టీ ఆగడాలకు అంతే లేకపోవడంతో చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది.   ఇసుక తవ్వకాల అంశంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇసుక తవ్వకాలు జరుపుతున్న తీరుపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.  నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తీర్పును యథాతథంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేని ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని, అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. అనుమతులు ఉన్నచోట మాన్యువల్ గా ఇసుక తవ్వకాలు జరుపుకోవచ్చని సూచించింది.  అక్రమాలకు పాల్పడిన వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వంతోపాటు, ఎన్జీటీని కూడా ఆదేశించింది. ఈ వ్యవహారంలో మే 9 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖలను సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా మే 9వ తేదీ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. తవ్వకాలు జరపడం లేదన్న విషయాన్ని అఫిడవిట్ రూపంలో తెలియజేయాలని జేపీ వెంచర్స్ ను ఆదేశించింది.  ఎన్జీటీ తీర్పుపై ఎలాంటి స్టే విధించలేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. పిటిషనర్ ఫిర్యాదుల మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్రిమినల్ చట్టాల మేరకు ఎఫ్ఐఆర్ దాఖలుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. తదుపరి విచారణను మే 10కి వాయిదా వేసింది.
Publish Date: Apr 29, 2024 3:47PM