అలీ పని ఖాళీ! జగన్ తో భేటీలతోనే సరి.. పదవి మాత్రం దూరం!

రాజ్యసభ స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నటుడు అలీకి జగన్ రిక్త హస్తం చూపి నిరాశ పరిచారు. దీంతో వైసీపీ కోసం స్నేహితుడి లాంటి పవన్ కల్యాణ్ కు దూరమై తప్పు చేశానా అని అలీ మథన పడుతున్నట్లు సామాజిక మాధ్యమంలో చర్చ చక్కర్లు కొడుతోంది.  వైసీపీలో చేరి అలీ జగన్ కోసం గత ఎన్నికలలో విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అలీ ప్రచారం జగన్ పార్టీకి మంచి ఫలితాలను ఇచ్చిందని చెబుతున్నారు.

అందుకే జగన్ అలీకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.  రాజ్యసభ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెడతానని ఆశ చూపారు. అయితే చివరికి ఏమీ లేకుండా కూరలో కరివేపాకులా తీసి పాడేశారని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపు వివాదం సమయంలో  ముఖ్యమంత్రి జగన్ తో చర్చలకు సినీ ప్రముఖులు వచ్చిన సమయంలో జగన్ అలీని ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ పెద్ద పీట వేశారు. ఆ తరువాత చర్చలు ముగిసిన తరువాత త్వరలో పిలుపు వస్తుందని ఆలీలో ఆవలు రేపారు.    ఆలీకీ కీలక పదవి ఖాయమంటూ మీడియాలో, సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది.   ఆలీ దంపతులు  తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి..   జగన్‌తో భేటీ అయ్యారు. 

]అయితే జగనన్న పిలుపు కోసం ఆలీ బాగానే వెయిట్ చేశారని సమాచారం. ఒకానొక దశలో సీఎం జగన్ నుంచి పిలుపు రాకపోవడంతో... ఆలీ తీవ్ర నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ప్రాణ స్నేహితుడు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను వదిలి.. ఫ్యాన్ పార్టీలోకి వెళ్లి తప్పు చేశాననే ఓ భావనలోకి సైతం ఆలీ సర్రున జారిపోయినట్లు సమాచారం. మాట తప్పం.. మడం తిప్పమని చెప్పుకునే జగన్ .. రాజ్యసభ కు అలీని ఎంపిక చేయకపోవడం ద్వారా  మాట తప్పి మడమ తిప్పారని అంటున్నారు. అలాగే తనతో నడిచిన వాళ్లను నడిరోడ్డులో వదిలేసి   బై బై చెప్పడం జగన్ కు అలవాటేనని పరిశీలకులు సోదాహరణంగా వివరిస్తున్నారు.

జగన్ అధికారంలో ఉండేది కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత ఎన్నికలు.. అందులో జనం ఎవరికి.. ఏ పార్టీకి పట్టం కడతారో తెలియదు. అలాంటి వేళ.. ఈ రెండేళ్ల కోసం ఆలీకి ఏ పదవి ఇస్తారనే ఓ ప్రశ్న సైతం ఫిలింనగర్ వర్గాల్లో ఉదయిస్తోంది. గత ఎన్నికల్లో రాజమండ్రి లేదా గుంటూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆలీ సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ ఆ సమయంలో సీట్ల సర్థుబాటు నేపథ్యంలో.. పార్టీ అధికారంలోకి వస్తే.. పోస్ట్ మాత్రం గ్యారెంటీ అంటూ ఆలీకి  జగన్ భరోసా ఇచ్చారని సమాచారం. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో ఆలీకి పదవి కేటాయించకపోవడంపై  అలీలో నిరాశ మాత్రం నివ్వురు గప్పిన నిపులా ఉందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.  ఆ అసంతృప్తి ఏ రూపంలో బయటపడుతుందన్నది చూడాలి.