కడప గడపలో చంద్రబాబుకు బ్రహ్మరథం.. జన ప్రభంజనం.. బంతి పూల వనం!

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి కడప జిల్లాలో ఘన స్వాగతం లభించింది. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన మాటలు వినడానికి ప్రభంజనంలా కదిలారు. ఆయన జిల్లా పర్యటనలో కడప బంతిపూల వనంగా మారింది. పసుపుపచ్చదనం సంతరించుకుంది. కడప పర్యటనలో చంద్రబాబుకు లభించిన ఆదరణ, ఆయన ప్రసంగాలకు లభించిన స్పందన తెలుగుదేశం క్యాడర్ లో ఆనందోత్సాహాలను నింపింది. వైఎస్ అడ్డాగా చెప్పుకునే కడపలో చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించడంతో జగన్ పాలన పట్ల వ్యతిరేకత ఆయన సొంత జిల్లాలో కూడా తీవ్ర స్థాయిలో ఉందన్నది తేటతెల్లమైందని రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది.

 ఇప్పటికే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలలో చంద్రబాబు పర్యటనలు విజయవంతమైన నేపథ్యంలో ఇప్పుడు రాయలసీమలో కూడా ఆయన పర్యటనకు వచ్చిన జనస్పందన రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ తెలుగుదేశానికి జనం మద్దతుగా నిలుస్తున్నారని అవగతమౌతోందంటున్నారు. కడప విమానాశ్రయం నుంచి పది కిలోమీటర్లు పసుపు జెండాలతో  తమ అధినేతకు స్వాగతం పలికేందుకు వచ్చిన తెలుగు తమ్ముళ్లతో కిక్కిరిసిపోయింది.  

డీఎస్ఆర్ క‌ల్యాణ‌మండ‌పంలో కార్య‌క‌ర్త‌ల స‌మావేశం,  నాయ‌కుల మ‌ధ్య‌ స‌మ‌న్వ‌య స‌మీక్ష జ‌రుగుతుంటే  బ‌య‌ట రోడ్ల‌న్నీ చంద్రబాబును చూసేందుకు వచ్చిన జనంతో నిండిపోయాయి.  ఆ పరిసరాలన్నీ పసుపు పూల తోట‌లా మారిపోయాయి.  ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు కోసం పులివెందుల నుంచి 250 వాహ‌నాలలో స్వ‌చ్ఛందంగా జనం తరలి వచ్చారు.

 బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంలో భాగంగా చంద్రబాబు కడప నుంచి  క‌మ‌లాపురం  వరకూ రోడ్డు మార్గంలో పయనించారు. క‌డ‌ప జిల్లా న‌లుమూల‌ల నుంచి ప్ర‌వాహంలా వచ్చిన జనం   వ‌ర్షాన్ని సైతం   లెక్క చేయ‌కుండా చంద్ర‌బాబు వెంట నిలిచారు. మిద్దెల‌పై కెక్కిన మ‌హిళ‌లు  చంద్ర‌బాబుకి అభివంద‌నం చేశారు. రోడ్డు కిరువైపులా జనం చంద్రబాబుకు జయజయధ్వానాలతో స్వాగతం పలికారు.