గీతంపై జగన్ దాడి!

కోర్టులంటే లెక్క లేదు... భూకబ్జాల యావే తప్ప మరో లక్ష్యం లేదు.  ఎక్క‌డెక్క‌డ ఖాళీ స్థ‌లాలు ఉన్నాయి.. ఎక్క‌డెక్క‌డ ప్ర‌భుత్వ భూములు ఉన్నాయి.. ఎక్క‌డెక్క‌డ టీడీపీ నేత‌ల ఆస్తులున్నాయి.. వాటిని స్వాధీనం చేసుకోవడం ఎలా మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా ఈ లక్ష్యంతోనే పని చేస్తోందా అనిపించేలా ఏపీలో పరిస్థితులు ఉన్నాయి.  

ముఖ్యంగా విశాఖ పట్నంలో తెలుగుదేశం నాయకుల ఆస్తులే టార్గెట్ గా ప్రభుత్వ యంత్రాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన నడిపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  అందులో భాగంగానే గీతం వ‌ర్సిటీ ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మితమైందంటూ చాలా కాలంగా జగన్ సర్కార్ హడావుడి చేస్తోంది. గతంలో ఒక సారి  విశాఖలోని ప్ర‌తిష్టాత్మ‌క విశ్వవిద్యాలయం గీతం యూనివ‌ర్శిటీకి చెందిన ప‌లు క‌ట్ట‌డాల‌ను విశాఖ మున్సిప‌ల్ అధికారులు   కూల్చివేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టారన్న ఆరోపణలతో.. గీతం వర్సిటీ ప్రధాన ద్వారంతో పాటు, ప్రహరీ గోడలో కొంతభాగం, అలాగే సెక్యూరిటీ రూములను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. ఈ సమయంలో యూనివర్సటీకి దారి తీసే రోడ్లను మూసివేసి మరీ కూల్చివేత కొనసాగయించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. తాజాగా ఇప్పుడు మరో మారు జగన్ వర్సిటీ అదే పునరావృతం చేసింది.  దీంతో విశాఖపట్నంలోని  గీతం యూనివర్సిటీ వద్ద మరోమారు ఉద్రిక్తత చోటుచేసుకుంది. శుక్రవారం (ఏప్రిల్ 14) తెల్లవారుజామున 2 గంటల నుంచే యూనివర్సిటీకి  నలువైపులా పోలీసులు భారీగా మోహరించి  వర్సిటీకి వెళ్లే మార్గంలో బారికేడ్లను అడ్డుగా ఉంచారు.

అటువైపు ఎవ్వరిని రానివ్వకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య కంచె నిర్మాణ సామాగ్రితో గీతం యూనివర్సిటీలోకి రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. గీతం యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో ప్రభుత్వం స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. మెుత్తం కిలోమీటర్‌ పొడవునా ప్రభుత్వ యంత్రాంగం కంచె వేసింది.కంచె వేస్తున్న స్థలమంతా ప్రభుత్వానిదేనని అధికారులు చెబుతున్నారు.  
ఆక్రమణల కూల్చివేత పేర శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆ ప్రాంతాన్ని ఒక యుద్ధ భూమిని తలపించేదిగా మార్చేశారు.  ఎండాడ  ప్రాంతం నుంచి బారికేడ్ లు ఏర్పాటు చేసి వాహనదారులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఐడి కార్డులు ఉంటేనే ఆ మార్గంలో అనుమతిస్తున్నారు.