చేతులు కాల్చుకుని ఆకుల కోసం జగన్ వెతుకులాట!
posted on Jan 23, 2024 3:20PM
తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్ కు ఇప్పుడు పట్టి మునిగే పరిస్థితి వచ్చే సరికి నాలుగో కాలు కనిపించిందా? తన మాట తనే వినని జగన్ కు సిట్టింగుల మార్పు నిర్ణయం కళ్లు బైర్లు కమ్మేలా గట్టి షాక్ ఇచ్చింది. పార్టీలో నిరసనలు పెచ్చరిల్లినా, అసంతృప్తి భగ్గుమన్నా పట్టించుకోని జగన్ ఇప్పుడు ఒక్కరొక్కరుగా సిట్టింగులు రాజీనామాలు చేసి పార్టీ వీడుతుంటే.. పార్టీ వీడిన వారి స్థానంలో కొత్త అభ్యర్థులు కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితుల్లో తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలని జగన్ భావిస్తున్నారు. అధికారం ఉంది. ఏం చేసినా చెల్లిపోతుంది. నా ఫొటో చాలు మరోసారి గెలిచేయడానికి అన్న భ్రమలు ఒక్కటొక్కటిగా తొలగిపోతుంటే.. ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురౌతుంటే.. గెలుపు ఆశలు కళ్ల ముందే ఆవిరైపోతుంటే... జగన్ నష్ట నివారణ చర్యలకు నడుంబిగించేందుకు ఉపక్రమించారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే జగన్ లోని ఈ మార్పు పట్ల పార్టీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.
ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేలు, 10 ఎంపీలను ఖరారు చేసేసిన తరువాత ఇప్పుడు తీరిగ్గా కాదు కాదు ఇది ఫైనల్ కాదంటూ పునరాలోచన చేస్తున్నానని చెప్పడం చేతులు పూర్తిగా కాలిపోయిన తరువాత పట్టుకోవడానికి ఆకుల కోసం వెతికిన చందంగా ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి.
వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలలో ఏ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రోది చేశాయో.. అంత కంటే ఎక్కువగా జగన్ సిట్టింగుల మార్పు ప్రయోగం పార్టీలో అసంతృప్తిని రాజేసింది. జగన్ కు అత్యంత నమ్మకస్థులు, నమ్మిన బంట్లు వంటి వారే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. జగన్ నాయకత్వాన్ని ప్రశ్నస్తున్నారు. పార్టీకి రాజీనామాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. పలువురు ఇప్పటికే రాజీనామా చేసి తమ దారి తాము చూసుకున్నారు. మరి కొందరు దారులు వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు.
ఇప్పుడు ప్రకటించిన నాలుగు జాబితాలూ ఫైనల్ కాదు, పునరాలోచిస్తున్నాం. మరో సారి సర్వే చేయించి సిట్టింగుల మార్పుపై నిర్ణయం తీసుకుంటామని అసంతృప్తులకు నచ్చచెబుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏది ఏమైనా నా మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరించే జగన్ కాదు కాదు అది శాసనం కాదు.. పరిశీలించి మాట మార్చుకుంటాను అంటూ ఒక మెట్టు దిగిరావడం ఆయనలో ఓటమి భయానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.