జగన్ అక్రమాస్తుల కేసు ఆగస్ట్ 21కి వాయిదా

 

అక్రమాస్తుల కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఏ-2 ముద్దాయిగా ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఇంకా అనేక మందిపై సీబీఐ 11 చార్జ్ షీట్లు దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వాటన్నిటినీ వేర్వేరుగా కాకుండా అన్నిటినీ కలిపి ఒకేసారి విచారణ చేయాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి తదితరులు సీబీఐ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిని సీబీఐ కోర్టు నిన్న విచారణకు చేప్పట్టినప్పుడు సీబీఐ తరపున వాదించిన న్యాయవాదులు వారి వేసిన పిటిషన్ న్ని తిరస్కరించాలని కోర్టుని కోరారు. ఈ 11 కేసుల్లో ఒకే రకమయిన నేరం జరిగినప్పటికీ అందులో అనేక మంది నిందితులు వేర్వేరు లక్ష్యాలతో ఈ కుట్రలకు పాల్పడ్డారని కనుక అన్ని చార్జ్ షీట్లను కలిపి విచారించడం సబబు కాదని వాదించారు. కొందరు కొన్ని కేసులలో ముద్దాయిలుగా ఉండగా, జగన్, విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు కొందరు అన్ని కేసులలో ముద్దాయిలుగా ఉన్నారని, వారు వివిధ మార్గాలలో, వేర్వేరు ప్రయోజనాలని ఆశించి ఈ నేరాలకి పాల్పడ్డారు కనుక 11 చార్జ్ షీట్లను కూడా వేర్వేరుగానే విచారించాలని, కనుక జగన్మోహన్ రెడ్డి తదితరులు వేసిన పిటిషన్ న్ని కొట్టివేయాలని సీబీఐ న్యాయవాదులు వాదించారు. ఇరు పక్షాల వాదనలను విన్న తరువాత సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వెంకట రమణ ఈ కేసుని ఆగస్ట్ 21కి వాయిదా వేశారు.