నేటితో గోదావరి మహాపుష్కరాలు సంపూర్ణం

 

రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత వైభవంగా సాగిన గోదావరి మహా పుష్కరాలు ఈరోజుతో ముగుస్తాయి. కనుక చివరి రోజయిన ఈరోజు పుష్కర స్నానాలు చేసేందుకు సుదూర ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలివస్తుండటంతో రెండు రాష్ట్రాలలో పుష్కర ఘాట్లు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం రెండు రాష్ట్రాలలో అన్ని ఘాట్ల వద్ద గోదావరి నదికి హారతి కార్యక్రమం నిర్వహిస్తారు.

 

ఈ మహా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పుష్కర ముగింపు వేడుకలను కూడా అంతకంటే ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఈరోజు సాయంత్రం రాజమండ్రిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించబోతోంది. కన్నులకింపుగా నిర్వహిస్తున్న గోదావరి హారతితో బాటు సాయంత్రం లేజర్ లైట్ల ప్రదర్శన, రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో వెయ్యి మంది కూచిపూడి కళాకారుల నృత్య ప్రదర్శన, సుప్రసిద్ధ గాయకుడు మంగళంపల్లి బాలమురళి కృష్ణచే కర్నాటక గాత్ర సంగీత కచేరీ మొదలయిన అనేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.