మనకీ మంచి రోజులు తప్పకుండా వస్తాయి అంటే...

 

 

ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి జిల్లాలో ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను ఓదార్చుతున్నారు. ఆయన చేసేది ఓదార్పు యాత్రాలే అయినా అవి రాజకీయ సభలకు ఏమాత్రం తీసిపోకుండా సాగుతున్నాయి. ఎప్పటిలాగే ప్రజలకు ఏ సమస్య ఎదురయినా, ఏ కష్టం వచ్చినా అందుకు అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వానిదే తప్పు అని విమర్శలు గుప్పించిన తరువాత ఆ సమస్యలన్నిటికీ తన వద్ద ఉన్న ఏకైక పరిష్కారం తను ముఖ్యమంత్రి అవడమేనని కుండబ్రద్దలు కొట్టినట్లు కాకపోయినా ఇంచుమించు అలాగే చెపుతుంటారు. అంతవరకు ప్రజలు ఓపికపట్టాలని, మనకీ మంచి రోజులు తప్పకుండా వస్తాయని జగన్మోహన్ రెడ్డి చెపుతుంటారు. ఈరోజు కూడా ఆయన మళ్ళీ అవే మాటలు ఎక్కడా పొల్లుపోకుండా చెప్పారు.

 

ఆయనపై సీబీఐ కేసులు నమోదు చేసి జైలుకి పంపినప్పుడు, ఆయనకి చెడ్డ రోజులు నడుస్తున్నాయని, కానీ పైనున్న ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ తనకు మంచి రోజులు వస్తాయని చెప్పుకొనేవారు. ఆయన కోరుకొన్నట్లే బెయిలు మీద బయటపడటమే కాకుండా ఎన్నికలలో పోటీ చేసి చట్ట సభలలో కూడా ప్రవేశించగలిగారు. అంటే ఆయనకి మంచి రోజులు వచ్చాయనే అనుకోవలసి ఉంటుంది. కానీ తను ముఖ్యమంత్రి అయిననాడే ప్రజలకు మంచి రోజులు మొదలవుతాయని ఆయన చెప్పడమే వెటకారం.

 

ఆయన కాంగ్రెస్ పార్టీని చాలా ఆచి తూచి విమర్శిస్తారు. ఎందుకంటే ఆయన పార్టీ మూలాలు ఎప్పటికీ అందులోనే ఉంటాయి. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలు చేసుకొన్నారంటే అందుకు కారణం గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేసిన అసమర్ధ పాలనే అనే విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు. అందులో ఐదేళ్ళపాటు ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆయన జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టేసి వేల కోట్లు ఖర్చు చేసారు. కానీ అంత ఖర్చు చేసినా రెండు రాష్ట్రాలలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కానీ ఆయన పోయిన తరువాత మంత్రులు, ఐ.ఏ.యస్. అధికారులు, వ్యాపారస్తులు చివరికి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డితో సహా అనేకమంది అవినీతి కేసులలో జైలుకి వెళ్ళవలసి వచ్చింది.

 

వేల కోట్లు ఖర్చు పెట్టి జలయజ్ఞం చేసినా రైతుల పొలాలకు నీళ్ళు అందించలేకపోయారు. ఆ కారణంగా వారు బోర్లు వేయించుకోవడానికి అప్పులు చేయవలసి వచ్చింది. బోర్లు వేయించుకొన్నా భూగర్భ జలాలు అడుగంటిపోవడం వలన వాటిలో నీళ్ళు వచ్చేవి కావు ..వచ్చినా నీళ్ళు తోడేందుకు కరెంటు ఉండదు. కానీ అన్నదాతలు చేసిన అప్పులు మాత్రం వారిని ప్రాణాలు తీసుకొనే వరకు వెంటాడుతూనే ఉంటాయి. వారి ఈ కష్టాలన్నిటికీ కాంగ్రెస్ పార్టీదే బాధ్యత కాదా? అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీ మళ్ళీ ఇప్పుడు రైతుల కుటుంబాలను ఓదార్చేందుకు బయలుదేరడం, మళ్ళీ తాము అధికారంలోకి వస్తే “అటువంటి మంచి రోజులు’ మళ్ళీ వస్తాయని చెప్పుకోవడం చూస్తుంటే వారికి ప్రజల పట్ల, వారి ఆలోచనా శక్తి పట్ల ఎంత చులకన భావం ఉందో అర్ధమవుతోంది. ఎంతసేపు తాము అధికారంలోకి రావాలని తపించిపోవడమే తప్ప నిజంగా ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల పట్ల వారికి ఏమాత్రం సానుభూతి మాత్రం ఉన్నట్లు కనబడటం లేదు. ఒకవేళ ఉంటే పరామర్శ యాత్రల కోసం ఇంత హడావుడి, అట్టహాసం చేసే వారే కాదు. వారి ఈ ప్రయత్నాలన్నీ ప్రజలను ఆకట్టుకొని తమ పార్టీని బలపరుచుకోవడానికే తప్ప మరొకందుకు కాదు.కనుక వారు చెప్పే మంచిరోజులు అంటే వారిరువురికీ అధికారం వచ్చిన రోజని ప్రజలు సర్దిచెప్పుకోవలసి ఉంటుంది.