కొవిడ్ ను వదిలేసి పాస్టర్లపై ఫోకస్! జగన్ సర్కార్ పై జనాల ఫైర్ 

ఏపీలో రోజుకు 20వేల‌కు పైగా కేసులు. ఐదు రోజుల్లోనే ల‌క్ష దాటిన పాజిటివ్ కేసులు. హాస్పిట‌ల్స్‌లో బెడ్స్ క‌రువు. ఆక్సిజ‌న్ కొర‌త‌తో పిట్టల్లా రాలుతున్న జనాలు.. హాస్పిటల్స్ లో శవాల గుట్టలు. శ‌వ‌ద‌హ‌నాల‌కూ ఇబ్బందులు. మందులు లేవు. టెస్టింగ్ కిట్స్ లేవు. ఇక వ్యాక్సిన్ ఊసే లేదు. మొత్తంగా చూస్తే హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు. అయినా క‌ర్ఫ్యూ పెట్టేసి చేతులు దులిపేసుకుంది స‌ర్కారు. ఇంత‌లా క‌రోనా క‌ల్లోలం రేపుతుంటే.. సీఎం జ‌గ‌న్ మాత్రం నీరో చ‌క్ర‌వ‌ర్తిలా తాడేప‌ల్లి ప్యాలెస్‌లో పిడేలు వాయించుకుంటున్నారనే విమ‌ర్శ‌లు. ప్రభుత్వ ఉదాసీన‌త‌పై రాజ‌కీయ ర‌చ్చ చెల‌రేగుతున్నా.. న‌వ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న‌ట్టు ఉంది పాల‌కులు వ్య‌వ‌హార శైలి. తాజాగా జ‌రిగిన ఏపీ కేబినెట్ స‌మావేశంలో అత్యంత ప్రాధాన్య‌మైన క‌రోనా అంశానికి.. అతి త‌క్కువ ప్ర‌యారిటీ ఇచ్చింది మంత్రి మండ‌లి. 

దేశంలోని అన్ని రాష్ట్రాలు కరోనాపైనే ఫోకస్ చేస్తే.. జగన్ రెడ్డి కేబినెట్ మీటింగ్ ఎజెండాలో మాత్రం 33వ అంశంగా క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ను చేర్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌డిచిన 10 రోజులుగా క‌రోనా కాకుండా వేరే ముఖ్య‌మైన టాపిక్ ఏదైనా ఉందా?  కొవిడ్ ఇంత‌లా మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తుంటే.. మంత్రి మండ‌లిలో చ‌ర్చించ‌డానికి క‌రోనా కంటే ముఖ్య‌మైన అంశాలుగా మ‌రో 32 టాపిక్స్‌ను ఎజెండాలో ముందు ఉంచ‌డం ఏంటి? ఇంత‌కంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ప్ర‌భుత్వానికి ప్ర‌జాల ప్రాణాల‌న్నా.. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌న్నా ఎందుకింత నిర్ల‌క్ష్యం? ఎందుకింత ఉదాసీన‌త‌? ఎందుకింత చేత‌గానిత‌నం? అంటూ ప్ర‌తిప‌క్షం విమ‌ర్శిస్తోంది. 

కేబినెట్ భేటీలో ప్రధాన అంశం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌ల‌సిందే. ఫాస్టర్లు, అర్చ‌కుల‌ప, ఇమామ్‌, మౌజ‌మ్‌ల‌కు జీతాలు పెంచ‌డం. ఈ టాపికే అజెండాలో ప్రియారిటీ ఐట‌మ్‌.  ఫాస్టర్లకు  రూ. 5వేల నుంచి రూ.10వేలకు గౌరవ వేతనం పెంపునకు బినెట్‌ ఆమోదం తెలిపింది. ఏ కేటగిరి ఆలయాల్లో అర్చకులకు రూ.15వేల గౌరవ వేతనం. బీ కేటగిరి ఆలయాల్లోరూ.10వేల గౌరవ వేతనానికి, ఇమామ్‌లకు రూ.5వేల నుంచి రూ.10వేలకు గౌరవ వేతనం పెంపు.. మౌజమ్‌లకు రూ.3వేల నుంచి రూ.5వేలకు గౌరవ వేతనం పెంపుకు ఏపీ కేబినెట్‌ అంగీకారం తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రోనాతో ఇంత‌లా అల్లాడిపోతుంటే ప్ర‌భుత్వం.. జీతాలు పెంచే టాపిక్‌ను టాప్ ప్ర‌యారిటీగా తీసుకోవ‌డంపై దుమారం చెల‌రేగుతోంది. అస‌లే ఖ‌జానాలో కాసులు లేవు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దివాళా తీసింది. గొప్ప‌ల‌కు పోయి చేప‌ట్టిన‌ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు కోసం అప్పులు చేయ‌డం, ప్ర‌భుత్వ భూముల‌ను అడ్డంగా అమ్ముకోవ‌డం చేస్తూ.. పాల‌న‌ను ఎలాగోలా నెట్టుకొస్తోంది. ఇంతగా ఆర్థిక లోటు వేధిస్తున్న ఈ స‌మ‌యంలో ఇలా జీతాలు పెంచే అంశానికి కేబినెట్‌లో తొలి ప్రాధాన్యం ఇవ్వ‌డం చోద్యం కాక మ‌రొక‌టి కాదు.

ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌, స‌రైన నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే ఏపీలో క‌రోనా విజృంభిస్తోంద‌నేది అంద‌రి మాట‌. ఆసుప‌త్రిల్లో బెడ్స్ సంఖ్య పెంచ‌డం, ఆక్సిజ‌న్ కొర‌త రాకుండా చూడ‌టం.. మందులు అందుబాటులోకి ఉంచ‌డంపై కేబినెట్ ఫోక‌స్ అంతా పెట్టాల్సింది పోయి.. మొద‌ట మ‌రో 32 అంశాలు చ‌ర్చించి.. ఆ త‌ర్వాత తీరిగ్గా క‌రోనాపై దృష్టి పెట్టేలా కేబినెట్ ఎజెండా ఉండ‌టం క్ష‌మించ‌రాని నేరం అంటున్నారు. అందుకే, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తాజా మంత్రిమండ‌లి స‌మావేశంపై ఓ రేంజ్‌లో మండిప‌డ్డారు. అటు, వ్యాక్సిన్ స‌న్న‌ద్ధ‌త‌పైనా ప్ర‌భుత్వాన్ని ఏకిపారేశారు చంద్ర‌బాబు. కరోనా విలయంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉంటే కేబినెట్‌ భేటీలో 33వ అంశంగా కరోనా అంశాన్ని చర్చకు తీసుకొన్నారని, అన్నీ అయిపోయిన తర్వాత చివర్లో దీన్ని పెట్టారని చంద్ర‌బాబు ఆక్షేపించారు. ‘ప్రభుత్వానికి ఇతర పనులు ఉండవచ్చు. కానీ ప్రజల ప్రాణాలు కాపాడటం అన్నిటికంటే అత్యవసరం. ప్రభుత్వం పెట్టిన డ్యాష్‌ బోర్డులో పడకలు, వెంటిలేటర్లు ఎన్ని ఖాళీలున్నాయో కచ్చితమైన సమాచారం ఉండటం లేదంటూ మండిప‌డ్డారు. 

ప్ర‌తిప‌క్ష‌మ‌నే కాదు.. స్వ‌ప‌క్షం నుంచీ ఇదే స్థాయి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స్వ‌యంగా అధికార పార్టీ నేత‌లే సీఎం జ‌గ‌న్ తీరును త‌ప్పుబ‌డుతున్నాయి. సెకెండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జగన్‌రెడ్డి చేతులెత్తేశారంటూ స్వయంగా వైసీపీ నేతలే మాట్లాడుకుంటుండం సంచలనంగా మారింది. ఈ నెల 3న రాజమండ్రి వైసీపీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ నివాసంలో ఎంపీ మార్గాని భరత్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాస్ చంద్రబోస్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కరోనా సంక్షోభం గురించి మాట్లాడుకున్నారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తరలించడానికి 30 వేలు, దహన సంస్కారాలకు 12 వేలు తీసుకుంటున్నారని వైసీపీ నేతలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని అభిప్రాయపడ్డారు. సీఎం ప్రవర్తనతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైసీపీ నేతలు మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇలా క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో విఫ‌లం అయ్యారంటూ అన్ని వ‌ర్గాల నుంచి సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయినా మ‌న ముఖ్య‌మంత్రి తాడేప‌ల్లి ప్యాలెస్ వీడి క‌ద‌లిరావ‌డం లేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించి అంచ‌నా వేయ‌డం లేదు. ప్ర‌జాక్షేత్రంలోకి వస్తేనే క‌దా ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలిసేవి? క‌రోనా క‌ల్లోలం సీఎం జ‌గ‌న్‌ కంటికి క‌నిపించేది. ముఖ్య‌మంత్రికి రాజ‌కీయ‌ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌పై ఉన్నంత‌ ఇంట్రెస్ట్‌.. కొవిడ్ క‌ట్ట‌డి, నివార‌ణ చ‌ర్య‌ల‌పై చూప‌డం లేదు. ప్ర‌జ‌ల ప్రాణాలంటే లెక్క‌లేదు. ఇదేం ముఖ్య‌మంత్రో ఏమో.. అని ప్ర‌జ‌లు త‌ల్ల‌డిల్లుతున్నారు.