బెంగాల్లో రాష్ట్రపతి పాలన?

తృణమూల్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ముచ్చటగా మూడవసారి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా అద్భుత విజయాన్ని సాధించి, హట్రిక్ కొట్టిన ఆమె బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ ఆమెతో  ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెను అభినందిచారు. మమత బెనర్జీ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు, ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం, గవర్నర్’తో కలిసి విలేకరుల సమావేసంలో మాట్లాడిన మమతా దీదీ, క్లుప్తంగా, తమ ప్రాధాన్యాలను వివరించారు. కొవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కొని, పరిస్థితిని అదుపులోకి తేవడమే తన ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె సంకేతమాత్రంగానే అయినా,కేంద్రంతో సయోధ్యతను కోరుకుంటున్నట్లు చెప్పారు. కొవిడ్ పై కలిసి పోరాటం సాగిద్దామని అన్నారు. అలాగే.. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చెలరేగుతున్న రాజకీయ హింసపై ఉక్కుపాదం మోపుతానని, హింసకు పాల్పడుతున్నవారిని వదిలిపెట్టబోనని పేర్కొన్నారు. “ఈ రోజు నుంచి శాంతిభద్రతల బాధ్యత నేనే తీసుకుంటా. దీనిపై కఠినంగా వ్యవహరిస్తా” ఇది నా రెండో ప్రాధాన్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పడానికి అన్ని పార్టీలూ సహకరించాలని కోరారు. 

మరోవంక గవర్నర్ ధన్‌కర్‌, ముఖ్యమంత్రి తమకు సోదరి సమానురాలు అంటూ, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసను అరికట్టి, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి అవసరమైన అన్ని చర్యలూ దీదీ  తీసుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఇలా తెరమీద కనిపించిన ఆల్ ఈజ్ వెల్, అంతా బాగుంది చిత్రం ఎలాఉన్నా, ఎన్నికల సందర్భంగా ఎగిసిపడిన రాజకీయ విద్వేష, వైషమ్యాలు ఇంకా పుర్తిగా పోలేదు. ఇప్పట్లో సమసి  పోయాయని, పోతాయని ఆశించే పరిస్థితులు కూడా  రాష్ట్రంలో కనిపించడం లేదు. అటు ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమైన కమలనాధులు కుతకుతా ఉడికి పోతున్నారు. మరో వంక, బ్రహ్మాండ విజయం ఇచ్చిన ఉత్సాహంలో, ఒక రకమైన విజయగర్వంలో  మునిగి తేలుతున్నతృణమూల్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్ధులను మట్టు పెట్టేందుకు ఇదే మంచి అనువుగా బావించి దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులలో ఇంతవరకు 14 మంది పైగా తమ కార్యకర్తలు హత్యకు గురయ్యారని బీజేపీ ఆరోపిస్తోంది. 

మరో వంక ఇరుపక్షాలు కూడా రాజకీయ వైరాన్ని మరో రూపంలో కొనసాగించే వ్యూహాలను రచిస్తున్నారు. మమత ప్రమాణస్వీకారానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్’కు ఫోన్ చేసి రాష్ట్రంలో జరుగతున్న హింస పట్ల ఆవేదన వ్యక్త పరిచారు. మరోవంక, మమత ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా ఆ పార్టీ నాయకులు, ‘రాజకీయ హింస అనే విషచక్రం నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుతామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని’ కోలకతాలో ప్రమాణం చేశారు. అదే క్రమమలో నడ్డా ప్రస్తుతం బెంగాల్లో జరుగుతున్న హింసను దేశ విభజన సందర్భంగా హిందువులపై జరిగిన హింసాకాండతో పోల్చడం ద్వారా హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని తృణమూల్ ఆరోపిస్తోంది. 

అదే విధంగా కేంద్ర హోమ్ శాఖ  రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటలపై రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కోరింది. అంతేకాదు, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో, నివేదిక పంపకపోతే, తీవ్ర పరిణామాలు ఉంటాయని హోమ్ శాఖ పేర్కొంది. మరోవంక రాష్ట్రంలో సాగుతున్న హింసపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీజేపీ నేత గౌరవ్‌ భాటియా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘బెంగాల్‌ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. వారిని టీఎంసీ గూండాలు హత్య చేస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగాయి. దుకాణాలను లూటీ చేస్తున్నారు’ అని గౌరవ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పరిణామాలను గమనిస్తే ఎన్నికల అనంతర హింస ఆసరాగా కమల దళం మమతా బెనర్జీ ప్రభుత్వంపై మరో యుద్దానికి సిద్దమవుతోందనిపిస్తోంది. ఇటు రాజకీయం, న్యాయ పరంగానే కాకుండా కేంద్ర ప్రభుత్వం తనకున్న విశేష అధికారాలను వినియోగించుకుని, మమతా బెనర్జీ ప్రభుత్వానికి ముందరి కాళ్ళకు బంధాలు వేయాలని బీజేపీ వ్యూహ రచన చేస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఇటు పార్టీ ఫిరాయించి గెలిచిన ఎమ్మెల్ల్యేలు మళ్ళీ మాతృ సంస్థ వైపు చూడకుండా చూడడంతో పాటుగా రాష్ట్రంలో వచ్చిన ఊపును మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో, అదే విధంగా తమ కార్యకర్తలను కాపాడుకునే వ్యూహంతో బీజేపీ ఎన్నికల అనంతర హింసను అస్త్రంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, తృణమూల్ ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దుస్సాహసం మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయక పోవచ్చును. కానీ, ఆర్టికల్ 356 రాష్ట్ర ప్రభుత్వ మెడ మీద కత్తిలా ఉంచి మమత దూకుడుకు కళ్ళే వేసే ప్రయత్నం మాత్రం చేస్తుంది. అయితే, ‘పోరాటమే’  ప్రధాన ఆయుధంగా  రాజకీయాలలో ఎదిగొచ్చిన మమత బెనర్జీ ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు బెదురుతారని, అనుకుంటే, బీజేపీకి మరో మారు శృంగభంగం తప్పదని తృణమూల్ నాయకులు ధీమాగా ఉన్నారు. అయితే ఏది ఎలా ఉన్నా, బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి ఇప్పట్లో చక్కబడే సంకేతాలు ప్రస్తుతానికి అయితే లేవనే చెప్పవచ్చును.