జగన్ హయాంలో మద్యం పేరిట విషం!
posted on May 12, 2025 2:57PM

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం పేరిట విషాన్ని విక్రయించారు. ఆ పనిని స్వయంగా అప్పటి జగన్ ప్రభుత్వమే చేసింది. జగన్ హయాంలో అమలు చేసిన మద్యం విధానం ప్రజారోగ్యాన్ని పీల్చి పిప్పి చేసింది. ఆ కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వం స్వయంగా మద్యం దుకాణాలను నిర్వహించి విక్రయించిన రకరకాల బ్రాండ్ల మద్యంలో ప్రాణాలకు హానికరమైన రసాయనాలు ఉన్నాయని అప్పట్లోనే నివేదికలు తేల్చి చెప్పాయి. ఆయా మద్యం బ్రాండ్లను కెమికల్ ల్యాబ్ లలో పరీక్షించి ఆయా బ్రాండల్లో హానికర కెమికల్స్ ఉన్నట్లు తేలినట్లు అప్పట్లోనే వార్తలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఆయా మద్యం బ్రాండ్ల తయారీదారులంతా వైసీపీ పెద్దలు, వారి సన్నిహితులేనని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అప్పట్లో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అప్పటి జగన్ సర్కార్ పట్టించుకోలేదు. అయితే రాష్ట్రంలో జగన్ సర్కార్ పతనమై తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ హయాంలో మద్యం కుంభకోణంపై దర్యాప్తునకు ఆదేశించింది.
ఆ దర్యాప్తు ఇప్పుడు వేగవంతమైంది. పలు అరెస్టులు కూడా జరిగాయి. అది పక్కన పెడితే.. జగన్ హయాంలో అవలంబించి మద్యం విధానం ప్రజారోగ్యాన్ని గుల్ల చేసిందన్న ఆరోపణలు అక్షర సత్యాలన్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. జగన్ ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసి సరఫరా చేసిన నాసిరకం మద్యం కారణంగా పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయనీ రుజువైంది. జగన్ హయాంలో సరఫరా చేసిన నాసిరకం మద్యం కారణంగా మద్యం సేవించిన వా రి ఆరోగ్యం క్షీణించిందన్న ఆరోపణలపై అధ్యయనానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక బృందాన్ని నియమించింది. ఆ బృందం తన అధ్యయన నివేదికను తాజాగా వెల్లడించింది.
జగన్ హయాంలో సరఫరా చేసిన మద్యం కారణంగా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైన మాట వాస్తవమని ఆ నివేదిక పేర్కొంది. 2019, 2024 మధ్య కాలంలో మద్యం సేవించే వారిలో మూత్ర పిండాలు, కాలేయ సంబంధిత వ్యాధులలో పెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఆ నివేదిక మేరకు మద్యం సంబంధిత వ్యాధులు విపరీతంగా పెరిగాయి. 2014-2019 మధ్య కాలంలో మద్యం సంబధిత వ్యాధులతో బాధపడిన వారి సంఖ్య 14, 026 కాగా సంఖ్య 2019-24 మధ్య కాలంలో దాదాపు రెట్టింపైంది. ఈ గణాంకాలు ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స పొందిన వారిది మాత్రమే. అలాగే కల్తీ మద్యం కారణంగా వ్యాధుల బారిన పడిన వారిలో 34 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కుల సంఖ్య అధికంగా ఉంది. కాగా ఈ జేబ్రాండ్ లిక్కర్ కారణంగా పలువురు నరాలకు సంబంధించిన వ్యాధుల బారిన కూడా పడ్డారని నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది.