జగన్ డిల్లీ పర్యటన.. మరిన్ని అరెస్టులకు సంకేతమేనా?
posted on Oct 4, 2023 6:28AM
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్ హస్తినలో ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆయనకు అధిష్ఠానం. నీట ముంచినా, పాల ముంచినా భారం మొత్తం వారి మీద వేసి వారి అండదండలతోనే జగన్ రాష్ట్రంలో తన అరాచక పాలన సాగిస్తున్నారు. ఇదీ జగన్ గత నాలుగేళ్ల పై చిలుకు పాలనపై పరిశీలకుల విశ్లేషణ. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో జగన్ పాపాలలో బీజేపీకి భాగం ఉందన్న విషయం సర్వులకూ తెలిసిపోయింది. స్వయంగా వైసీపీ వర్గాలే చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఆశీస్సులు జగన్ కు ఉన్నాయనీ, ఈ అరెస్టుల పర్వం చంద్రబాబుతోనే ఆగదనీ బాహాటంగానే చెబుతున్నారు. కేసుల పేర్లు, సెక్షన్లు ఉటంకిస్తూ తరువాత అరెస్టు ఎవరిదో వారు చెప్పేస్తున్నారు కూడా.
సరిగ్గా ఈ సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయనకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్లు ఖరారయ్యయని చెబుతున్నారు. అన్నీ కుదిరితే శుక్రవారం (అక్టోబర్6) జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. నిజానికి గత వారమే జగన్ ఢిల్లీ వెళ్లాలని ప్రయత్నించారు. విదేశీ పర్యటనలు ముగించుకుని రాష్ట్రానికి రాగానే జగన్ ఢిల్లీ పర్యటనకు వెడతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే ఢిల్లీ పెద్దల నుండి అనుమతి లభించకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది. ఇక ఇప్పుడు మాత్రం కేంద్ర పెద్దల అనుమతి, అపాయిట్ మెంట్లు దొరకడంతో జగన్ రెడ్డి హస్తిన ప్రయాణం ఖరారైంది. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తారని అంటున్నారు. కాగా, జగన్ హస్తిన పర్యటనపై రాజకీయ వర్గాలలో పలు విధాల చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ , ఈ నెలలోనే తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.
బీజేపీ మద్దతుతోనే జగన్ చంద్రబాబును అరెస్ట్ చేశారన్న భావన అన్ని వర్గాలలోనూ వ్యక్తమౌతున్నది. ముఖ్యంగా మోడీ, అమిత్ షాలకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా జగన్ ఈ పని చేశారంటే ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంతెందుకు కేంద్ర పెద్దల మద్దతుతోనే చంద్రబాబును అరెస్టు చేశామని వైసీపీ నేతలే స్వయంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు జగన్ అదే పెద్దలను కలవనున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ వ్యక్తం అవుతోంది. వచ్చే సోమవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు అరెస్టుపై విచారణ జరగనున్నది, అదే సమయానికి జగన్ కూడా ఢిల్లీలోనే ఉండి కేంద్ర పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో పరిణామాలు ఎలా ఉండనున్నాయి? ఢిల్లీ నుండి ఏపీకి ఎలాంటి సంకేతాలు అండనున్నాయన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
మరోవైపు చంద్రబాబుతో పాటు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు, మార్గదర్శి ఎండీ శైలజ వంటి వారిని కూడా జైలుకు పంపాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారని వైసీపీ నేతలే బహిరంగంగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వీరి అరెస్టుకు కొన్ని పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో మరోసారి ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసమే జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ముందస్తు ఎన్నికలకు క్లియరెన్స్ కోసం కూడా జగన్ హస్తిన పర్యటనకు వెళుతున్నారని అంటున్నారు. అందుకోసమే ప్రత్యర్థుల్లోని బలమైన నేతలను జైలుకు పంపి ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహం తోనే హస్తిన పెద్దల ఆశీస్సులు, అనుమతి కోరేందుకే జగన్ హస్తిన వెళ్లారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు అక్రమ ఆస్తుల కేసులు, వివేకా హత్యకేసు వంటి సొంత కేసులు, అదానీ ప్రాజెక్టులు తదితర అంశాల సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వెనక కారణాలు కావచ్చని అధికార వర్గాలు చెబుతున్నారు.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు, నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఏ నెలకి ఆ నెల జీతాలు, పెన్షన్లు వంటి అతి సామాన్య ఖర్చులకు కూడా తెగ కసరత్తులు చేయాల్సి వస్తుంది. అప్పులకోసం ప్రతీ వారం ఆర్బీఐ వద్ద బాండ్లు వేలం వేస్తున్నా సరిపోనంత నిధుల కొరత వెంటాడుతోంది. కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించాల్సి ఉంది. వచ్చే జనవరిలోపు రూ. పదిహేను వేల కోట్లు బిల్లులు చెల్లింపులు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాటికి నిధుల కోసం కేంద్రం దగ్గర జగన్ ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పటికే చేయాల్సిన స్థాయిని మించి అప్పులు చేయగా ఇప్పుడు కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఎన్నికల ఏడాదిలో ఇలాంటి కష్టాలు ప్రభుత్వానికి తీరని నష్టం కాగా మరికొన్ని రోజులు ప్రభుత్వం నడిచేలా పెద్దల ఆశీస్సుల కోసం జగన్ ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. మరి స్పెషల్ ఫ్లైట్ లో మరోసారి ఢిల్లీ వెళ్లనున్న జగన్ ఏ మేరకు వ్యూహాలను అమలు చేస్తారో చూడాల్సి ఉంది.