కాంగ్రెస్‌తో దోస్తీ.. మారిన జగన్ వ్యూహం !?
posted on Jul 22, 2024 5:29AM
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారా.. ఏపీలో చంద్రబాబును ఇరకాటంలో పెట్టేందుకు కేంద్ర కాంగ్రెస్ పెద్దలు , వైసీపీ నేతలు కలిసి ప్లాన్ చేస్తున్నారా..? జాతీయ రాజకీయాల్లో జగన్ మోహన్ రెడ్డిని హైలేట్ చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు సుముఖత వ్యక్తం చేశారా..? ఈ ప్రశ్నలకు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో ఘోర పరాభవం తరువాత జగన్ తన రాజకీయ వ్యూహాలను మార్చినట్లు కనిపిస్తోంది. గతంలో బీజేపీ ఛీ కొట్టినా కేసుల నుంచి తప్పించుకునేందుకు జగన్ వారికి మద్దతు ఇస్తూ వచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి జగన్ మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే ప్రాధాన్యత ఇచ్చారనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ ఢిల్లీలో ధర్నా చేయాలనుకోవడం వెనుక కేంద్ర కాంగ్రెస్ పెద్దల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో బీజేపీ సంఖ్యాబలం తక్కువగా ఉంది. రాజ్యసభలో బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లు పాస్ కావాలంటే తప్పనిసరిగా వైసీపీ సహకారం అవసరం. దీనిని ఆసరా చేసుకున్న జగన్ మోహన్ రెడ్డి బీజేపీ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించి.. కాంగ్రెస్ తో దోస్తీకి రెడీ అయ్యారని అంటున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనతో విసిగిపోయిన ఏపీ ప్రజలు ఓటు ద్వారా ఆయనను గద్దె దింపారు. అసెంబ్లీలో ఆయన పార్టీని కేవలం 11 స్థానాలకే పరిమితంచేసి.. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదు పొమ్మన్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. పుండుపై కారం చల్లినట్లుగా ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రయత్నాలు మొదలు పెట్టారు. విజయవాడ వేదికగా కాగ్రెస్ ఆధ్వర్యంలో ఆమె వైఎస్ఆర్ జయంతిని నిర్వహించారు. వైఎస్ జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఏపీలోని కాంగ్రెస్ పెద్దలు పాల్గొన్నారు. ఈ సభ విజయవంతం ద్వారా కాంగ్రెస్ పార్టీకి త్వరలో పూర్వవైభవం వస్తుందని షర్మిల చెప్పకనే చెప్పారు. దీనికి తోడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని, వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని తానేనని షర్మిల ప్రకటించుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రాజకీయ వారసుడు కాదని షర్మిల చెప్పడం జగన్ శిబిరంలో ఆందోళన రేకెత్తించింది. షర్మిల దూకుడుకు అడ్డకట్ట వేయకపోతే వైసీపీ మనుగడకే ప్రమాదం ఉందని భావించిన జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పెద్దల టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
జగన్ మోహన్‌రెడ్డి ఇటీవల కేంద్ర కాంగ్రెస్ పెద్దలతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రెండు సార్లు బెంగళూరు వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి.. కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డి.కె. శివకుమార్ తో భేటీ అయినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తన మద్దతు ఉంటుందని, ఫండింగ్ విషయంలోనూ తన సహాయసహకారాలు ఉంటాయని జగన్ హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. గత పదేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి కేంద్రంలో ఎన్డీయే కూటమికి మద్దతుగా ఉంటూ వచ్చారు. దీనికి ప్రధాన కారణం తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకేనని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం కూడా ఎన్డీయే కూటమికే వైసీపీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం కాంగ్రెస్ కు వైసీపీ మద్దతుగా నిలిచినప్పటికీ కేంద్రంలోని బీజేపీ పెద్దలు తమను ఏమీ చేయలేరన్న ధీమాతో జగన్ ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే.. రాజ్యసభలో వైసీపీకి 11 స్థానాలు ఉన్నాయి. రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే ఎన్డీయేకు పూర్తి మెజార్టీ లేదు. వైసీపీ సహకారం తప్పని సరి. దీంతో జగన్ సైతం బీజేపీకి వ్యతిరేకంగా తన రాజకీయ అడుగులు వేసేందుకు ధైర్యం చేస్తున్నారని తెలుస్తోంది. రాజ్యసభలో ఎన్డీయేకు మద్దతు ఇచ్చి.. మిగతా విషయాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జగన్ మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యం ఏపీలో చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పెట్టడమే. అధికారంలో లేకపోయినా.. చంద్రబాబుపై ఏపీలో, జాతీయ రాజకీయాల్లో పైచేయి సాధించాలన్నది జగన్ ప్రణాళికగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకోసమే.. కాంగ్రెస్ సహకారం తీసుకోనున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి మైలేజీ ఇచ్చేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సైతం సై అన్నారని అంటున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపధ్యంలో లోక్ సభ స్పీకర్ ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ కావాలని జేడీయూ డిమాండ్ చేయగా.. ఏపీకి ప్రత్యేక హోదాను విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. జేడీయూ ప్రత్యేక హోదా అడిగింది, ఏపీలో వైసీపీ మాకు ప్రత్యేక హోదా కావాలని కోరింది. కానీ, తెలుగుదేశం మాత్రం ఆ మాటెత్తలేదని ఆయన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రత్యేక హోదా ఊసెత్తని జగన్.. ఉన్నట్లుండి ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని గొంతెత్తడంపై ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు జగన్ ప్రయత్నాలను బీజేపీ ఎలా తీసుకుటుందన్నదే రాజకీయ వర్గాల్లో కీలక అంశంగా మారింది.