లోకేష్ భజన చేసిన దువ్వాడ.. కత్తికట్టిన జగన్
posted on Apr 25, 2025 11:42AM
.webp)
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాడ్ టైమ్ అంటే ఎలా ఉంటుందో చూస్తున్నారు. గతంలో ప్రత్యర్ధి పార్టీ నేతలపై బూతు పురాణం వల్లె వేసిన దువ్వాడను వైసీపీ నెత్తిన పెట్టుకుంది. వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన్ని ఎమ్మెల్సీని చేసి భుజం తట్టి మరీ ప్రోత్సహించారు. అదే జగన్ ఇప్పుడు ఆయన్ని ఇక నీ అవసరం లేదంటూ.. పక్కన పెట్టేశారు. క్రమశిక్షణ చర్యలు పేరుతో సస్పెన్షన్ వేటు వేశారు.
వైసీపీ అధికారంలో ఉండగా అడ్డూ అదుపూ లేకుండా నోరు పారేసుకున్న ఆ పార్టీ నాయకుల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ముందు వరుసలో ఉంటారు. చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లపై అసభ్యకర భాషతో విమర్శలు గుప్పిస్తూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. అందుకే దువ్వాడ వైసీపీ స్థాపించాక ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయినా జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి ... మధ్యలో దివ్వెల మాధురి. ఈ ఫ్యామిలీ డ్రామా గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ప్రస్తుతం వారి వివాదం కోర్టులో కొనసాగుతోంది. మాధురితో కలిసి హైదరాబాద్‌లో వస్త్ర వ్యాపారం చేసుకుంటున్న దువ్వాడ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక మళ్లీ మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్సీ స్పందించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఇన్నాళ్లు గౌరవం ఇచ్చిన జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని.. అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని దువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలను బూచిగా చూపించి రాజకీయ క్రీడలో బలిపశువును చేశారన్నారు.
దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోడ్డుకెక్కడంతోపాటు.. మాధురితో ఆయన కలిసి ఉండడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. నిజంగా దువ్వాడపై జగన్ తీసుకున్నది క్రమశిక్షణ చర్యే అయితే.. ఆ పని ఎప్పుడో చేసి ఉండాలి. దివ్వెల మాదురి వ్యవహారంలో రచ్చకెక్కినప్పుడు సస్పెన్షన్ వేటు వేయాలి. మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇన్‌స్టా రీల్స్, తిరుమల పర్యటనలో ఫొటోషూట్, కుటుంబ వివాదాలతో దువ్వాడ ఎప్పుడో రచ్చకెక్కారు. కానీ... జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు.
అలాంటిది... ఉన్నట్టుండి ఆయనను ఎందుకు సస్పెండ్ చేశారన్న దానిపై ఆరా తీస్తే ఆసక్తికర విషయం తెలిసింది. మంత్రి లోకేష్‌ను పొగడటమే దువ్వాడపై వేటుకు కారణమని తెలిసింది. ఇటీవల ఒక సోషల్ మీడియా ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి పాల్గొన్నారు. బాలయ్య తర్వాత స్వీటెస్ట్ పర్సన్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు... లోకేష్ అని ఇద్దరూ కూడబలుక్కున్నట్లు ఒకే సారి సమాధానం చెప్పారు. లోకేష్ తెలివైనవాడని, ముఖ్యమంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేస్తారని, యువకుడనీ తెగ పొగిడేశారు. ఆ లోకేష్ జపం ఆ నోటా ఈ నోటా జగన్ చెవిన పడిందంట. లోకేష్‌ను అంతగా పొడిగితే జగన్ ఊరుకుంటారా.. అందుకే దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేశారంట. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటారు.. ఇదేనేమో..?