అమరావతి మునిగిపోతుంటే.. జగన్ ఎందుకు పర్యటించరు?
posted on Aug 20, 2025 3:55PM

ఆరోపణలు చేసి చేతులు దులిపేసుకోవడమే తప్ప.. ఆ ఆరోపణలకు రుజువులు చూపించాలన్న బాధ్యతను మాత్రం ఇసుమంతైనా పట్టించుకోరు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ . ఇక అమరావతి విషయంలో ఆయితే ఆయన వెళ్లగక్కే విద్వేషానికి, చేసే విమర్శలు, ఆరోపణలకు అంతే ఉండదు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని అనాథ రాష్ట్రంలా మార్చారు. మూడు రాజధానులంటూ కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చకుండా.. విశాఖలో రుషికొండకు బోడిగుండు కొట్టి మరీ ప్యాలెస్ నిర్మిచారు. 151 స్థానాలతో అధికారం చేజిక్కించుకున్న వైసీపీ ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి 11 స్థానాలతో కనీసం ప్రతిపక్ష హోదాకి కూడా నోచుకోని విధంగా దిగజారిపోవడానికి అధికారంలో ఉండగా అనుసరించిన ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలే కారణమనడంలో ఎటువంటి సందేహం లేదు. నాడు అంటే 2014-19 మధ్య కాలంలో అమరావతికి జై కొట్టిన జగన్.. అధికారంలో ఉన్న ఐదేళ్లూ అమరావతిని నిర్వీర్యం చేయడానికి చేయగలిగినంతా చేశారు. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులను వేధించారు. వారిపై అక్రమ కేసులు బనాయించారు. ఇక అప్పటి ప్రతిపక్ష నేతపై అవమానక వ్యాఖ్యలు చేయించారు. అక్రమ కేసులో 52 రోజుల పాటు జైలుకు పంపారు. సరే ఇవన్నీ పంటి బిగువున భరించి ఆగ్రహాన్ని పెదవి బిగింపులో దాచుకుని ఎన్నికల వేళ ప్రజలు తన సత్తా చాటి జగన్ కు ఘోరాతి ఘోరమైన పరాభవాన్ని, పరాజయాన్ని రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని నిర్మాణం జోరందుకుంది. అయితే జగన్, ఆయన పార్టీ నేతలూ మాత్రం అమరావతిపై విషం కక్కడం మానలేదు. తాజా వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. ఫేక్ వీడియోలతో సోంత మీడియా, సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు. ఇక్కడే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాబాహుల్యంలో ఓ సందేహం వ్యక్తం అవుతున్నది. నిజంగానే అమరావతి మునిగిపోతుంటే.. అక్కడి ప్రజలకు అండగా నిలబడి పోరాడేందుకు తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటి జగన్ ఎందుకు పర్యటించడం లేదు అన్నదే ఆ సందేహం. జగన్ అమరావతిలో ముంపునకు గురైన ప్రాంతాలు నిజంగా ఉంటే.. ఆయా ప్రాంతాలలో పర్యటించవచ్చు కదా.. గతంలో బుడమేరు వరద ముంపులో బెజవాడ చిక్కుకున్నప్పుడు పర్యటించారు కదా? ఇప్పుడు ఆయనకు అడ్డుపడుతున్నదేమిటి? అడ్డుకుంటున్నదెవరు?
ఇక్కడే జగన్ తీరు, అమరావతిపై వైసీపీ చేస్తున్న విమర్శలు నమ్మశక్యంగా లేవని జనం అంటున్నారు. పరిశీలకులు కూడా అమరావతి ముంపు అంటూ వైసీపీయులు చేస్తున్న రాద్ధాంతం అసత్య ప్రచార మేనని విశ్లేషిస్తున్నారు. నిజంగా అమరావతిలో ముందు ప్రాంతాలు ఉన్నట్లైతే.. జగన్ కచ్చితంగా పర్యటించేవారనీ, కానీ ఇప్పుడు పర్యటిస్తే అమరావతిలో వరద ముంపు కాకుండా, నిటారుగా నిలబడిన నిర్మాణాలు కనిపిస్తాయనీ తెలుసుకనుకనే ఫేక్ ప్రచారాలను నమ్ముకుని జనంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.