అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. జగన్ తీరిక మారదా?
posted on Feb 23, 2025 9:15AM
.webp)
అందితే జుట్టు లేకుంటే కాళ్లు పట్టుకునే మనస్థత్వం మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిది. ఈ విషయం చాలాసార్లు రుజువైంది. తాజాగా మరోసారి జగన్ అదే ఫార్ములాను అమలు చేయబోతున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు అసెంబ్లీకి వెళ్లనంటూ ఇన్నాళ్లు మొండిపట్టు పట్టిన జగన్.. తన అసెంబ్లీ సభ్యత్వంపైనే అనర్హత వేటు పడే పరిస్థితి వచ్చే సరికి యూటర్న్ తీసుకోవడానికి రెడీ అయిపోయారు. అనర్హత వేటు పడితే పులివెందుల నియోజకవర్గం నుంచి మరో సారి గెలుస్తానన్న నమ్మకం జగన్ లో లేకపోవడం వల్లనే ఆయన అసెంబ్లీకి హాజరై ఆ వేటు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. జగన్ సిల్లీ ప్లాన్ చూసి వైసీపీ నేతలు సైతం చీదరించుకుంటున్న పరిస్థితి. వాస్తవానికి.. పార్టీలోని ముఖ్యనేతలను సైతం జగన్ రాజకీయ అవసరానికి వాడుకొని తరువాత పక్కనపెట్టేసిన సందర్భాలు కోకొల్లలు. ఈ క్రమంలో వైసీపీకి వీరాభిమానులం, రాజకీయాల్లో ఉన్నంతకాలం వైసీపీలోనే ఉంటాం అంటూ దీమాగా చెప్పిన వారు సైతం.. ఆ పార్టీని వీడుతున్నారంటే.. ఆయన యూజ్ అండ్ త్రో పాలసీ అర్ధమౌతుంది.
మరోవైపు.. తనపై తానే దాడులు చేయించుకొని ప్రజల్లో సానుభూతి పొందడంలో జగన్ మోహన్ రెడ్డిని మించిన రాజకీయ నేత దేశ రాజకీయాల్లో ఎక్కడా కనిపించరు. బాబాయ్ హత్య, కోడికత్తి డ్రామాతోపాటు ఒక్క ఛాన్స్ ఫ్లీజ్ అంటూ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్.. ఐదేళ్లు ఏపీ ప్రజలకు నరకం చూపించారు. వైసీపీ హయాంలో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన పరిస్థితి. దీంతో 2024 ఎన్నికల్లో ఏపీలోని అన్ని వర్గాల ప్రజలు ఏకమై జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలకు గట్టి గుణపాఠం చెప్పారు. ఫలితంగా కేవలం 11 సీట్లలో మాత్రమే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అంటే.. ఏపీ ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదాకు సరిపడా అసెంబ్లీ స్థానాలను సైతం వైసీపీ పార్టీకి ఇవ్వలేదు. కానీ, జగన్ మోహన్ రెడ్డి మాత్రం తనకు ప్రతిపక్ష నేత హోదా, తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అధికార పార్టీని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ వస్తానని హఠం చేస్తున్నారు. ప్రజలే ఇవ్వని ప్రతిపక్ష హోదాను జగన్, వైసీపీ నేతలు కోరుకుంటుండటం ప్రజాతీర్పుపై వారికి ఎంత గౌరవం ఉందో తేటతెల్లం చేస్తుంది. ఇటీవల.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి నానా రభస చేసిన జగన్.. ప్రతిపక్ష నేత వచ్చినా సరియైన భద్రత ఇవ్వరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించి తానో రాజకీయ జోకర్ గా నిరూపించుకున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వచ్చారు. ఆ తరువాత జగన్, మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. పలుసార్లు సమావేశాలకు హాజరుకావాలని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కోరినప్పటికీ.. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటూ జగన్ వాదిస్తూ వస్తున్నారు. అసెంబ్లీకి హాజరుకాని జగన్మోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెడీ అయ్యారు. అయితే, చేతనైంది చేసుకోండి అని జగన్ రెడ్డి కూడా ఇటీవల మీడియా సమావేశంలో అన్నారు . అయితే ఆయనదంతా అందితే జుట్టు .. అందకపోతే కాళ్లు పట్టుకునే మనస్థత్వం అని చాలా సార్లు రుజువు అయింది. ఇప్పుడు తనపై అనర్హతా వేటువేస్తే మళ్లీ గెలవడం అసాధ్యం అని అర్థం కావడంతో ఆయన ఒక్కరోజు అసెంబ్లీకి హాజరవ్వాలని అనుకుంటున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
వరుసగా మూడు సెషన్లు లేదా.. అరవై రోజుల్లో ఒక్కరోజైనా సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి జగన్ కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మాత్రమే అసెంబ్లీకి వచ్చాడు. ఆ తరువాత జగన్, వైసీపీ నేతలు సమావేశాలకు హాజరు కాలేదు. వచ్చే సమావేశాలకు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటే వేసేందుకు అవకాశం ఉంటుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు. సెలవు చీటీ స్పీకర్ కు రాసి పంపినా ఆయన ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు.. అనుకుంటున్నారేమో కానీ.. ఒక్కరోజు అసెంబ్లీకి పోతే పోలా అని జగన్ అనుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యేందుకు జగన్ తోపాటు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
అలా ఒక్కరోజు హాజరైతే ఆ తర్వాత అరవై రోజుల పాటు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నారు. ఇది సాంకేతికంగా అనర్హత వేటు నుంచి తప్పించుకునే పద్ధతి మాత్రమే. కానీ, ఇలా అడ్డగోలుగా అసెంబ్లీకి డుమ్మా కొడితే తర్వాత ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారు? అని వైసీపీ నేతలే అంటున్నారు. జగన్ తాజా నిర్ణయాన్ని వైసీపీ నేతలుసైతం సమర్ధించడం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇలా అయితే, వైసీపీ మనుగడ ఉండదన్న ఆందోళన వైసీపీ నేతలలో వ్యక్తమౌతోంది.