సాహోరే ఇస్రో బాహుబలి..
posted on Jun 5, 2017 6:12PM

ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రెండో ప్రయోగ కేంద్రం నుండి.. జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి1 నింగిలోకి దూసుకెళ్లింది. నిన్న సాయంత్రం 3.58 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ సాయంత్రం 5.28 గంటలకు ముగియడంతో నిమ్ములు చిమ్ముతూ నింగికెగిరింది. కాగా దీనిద్వారా 3,136 కిలోల భారీ ఉపగ్రహం జీశాట్-19ని రోదసీలోకి ప్రవేశపెట్టారు. దీంతో ఇస్రో అంతరిక్షంలో త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది.
జీఎస్‌ఎల్‌వీ-మార్క్3డీ1 విశేషాలు...
రాకెట్ బరువు 640 టన్నులు. ఎత్తు 43 మీటర్లు. ఇందులో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో ఎస్200 మోటార్లు రెండు, రెండో దశలో ఎల్110 లిక్విడ్ కోర్ ఇంజిన్, మూడో దశలో సీ25 క్రయోజెనిక్ ఇంజిన్ ఉన్నాయి. ఈ క్రయోజినిక్ ఇంజిన్ ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్ప జరిపారు. కాగా క్రయోజినిక్ ఇంజిన్ లో 28 టన్నుల శీతల ఇంధనాలు ఉంటాయి. ఉపగ్రహంలో కేయూ బాండ్ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌పాండర్స్‌తోపాటు జియో స్టేషనరీ రేడియేషన్ స్పెక్ట్రోమీటర్ పేలోడ్స్‌ను అమర్చి పంపుతున్నారు. 3,136 కిలోల ఉపగ్రహంలో 1,742 కిలోల ఇంధనం నింపారు. పేలోడ్స్ బరువు 1,394 కిలోలు.
జీశాట్–19తో ఉపయోగాలు...
జీశాట్–19 సమాచార ఉపగ్రహం బరువు 3,136 కిలోలు. ఇది దేశంలో టెలివిజన్ ప్రసారాలు, టెలికం రంగంలో విస్తృతసేవలు, ఇంటర్నెట్ వేగవంతంగా పనిచేయడమేగాక అధునాతనమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి తెస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఇంటర్నెట్‌ను వేగవంతం చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది. ఈ జీశాట్–9 ఉపగ్రహం పదేళ్లపాటు సేవలు అందిస్తుంది. ఈ ప్రయోగం ద్వారా అత్యంత బరువువైన ఉపగ్రహాలను మన గడ్డ నుంచే కక్ష్యలోకి పంపే సత్తా చేకూరుతుంది. దీనివల్ల రూ.400 కోట్ల మేర ఖర్చూ తగ్గుతుంది. 4,500-5,000 కిలోల బరువు గల ఇన్‌శాట్-4 తరహా ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే స్థాయికి ఇస్రో ఎదుగుతుంది.