ఇస్రో మాజీ ఛైర్మ‌న్ క‌స్తూరి రంగ‌న్ క‌న్నుమూత‌

 

 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ  మాజీ ఛైర్మ‌న్ డాక్టర్ కృష్ణ‌స్వామి కస్తూరి రంగన్  (84) కన్నుమూశారు. ఇవాళ ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచానట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1994 నుంచి 2003 వరకు ఆయన ఇస్రో చైర్మన్ గా గా కొనసాగారు. PSLV, జీఎస్ఎల్వీ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించారు. 2020 జాతీయ విద్యా విధానం రూపకల్పన కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు. అనంతరం 2003 నుంచి 2009 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. అలాగే మోదీ సర్కార్ రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను తయారు చేసిన కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షత వహించారు.

2004 నుంచి 2009 మధ్యకాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (NIAS)కు డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. ఈ సంస్థ ద్వారా దేశం యొక్క శాస్త్రీయ, సాంకేతిక అభివృద్ధికి కస్తూరి రంగన్ తోడ్పాటు అందించారు.  కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.  1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్ భార్య 1991లో కన్నుమూశారు.