సుబ్రమణ్యం అలియాస్ ఒమర్..కేరాఫ్ ఐసిస్
posted on Jun 24, 2017 12:48PM
.jpg)
తన భావజాలంతో..మారణ హోమంతో ఎంతోమంది ముస్లిం యువతను ఉగ్రవాదంపై మళ్లిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ప్రపంచదేశాలపై పెను ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు ముస్లిం యువత మాత్రమే ఐసిస్‌లో చేరుతుండగా..తాజాగా హిందువులు కూడా ఆ లిస్ట్‌లో చేరుతున్నారు. ఇందుకు తాజాగా జరిగిన సంఘటనే పెద్ద ఉదాహరణ. కృష్ణాజిల్లాకు చెందిన ఓ హిందూ యువకుడు ఐసిస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై ఏకంగా మతం మార్చుకుని ఆ సంస్థలో చేరిపోయాడు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు కుట్రపన్నిన ఐఎస్ ఉగ్రవాదిని హైదరాబాద్ ప్రత్యేక పోలీసు బృందం అరెస్ట్ చేసింది. అనంతరం అతడిని విచారించిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి పేరు కొనకళ్ల సుబ్రమణ్యం అలియాస్ ఒమర్..కృష్ణాజిల్లా చల్లపల్లి మండలానికి చెందిన వ్యక్తి. ఇస్లాంవైపు ఆకర్షితుడై 2014లో మతం మార్చుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఈ క్రమంలో అతడికి ఐఎస్ సానుభూతిపరులతో పరిచయం ఏర్పడింది. తరచూ వారితో టెలిగ్రామ్‌లో మాట్లాడుతూ దేశంలో మారణహోమం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఒమర్‌పై నిఘాపెట్టిన పోలీసులు అతడు దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్రపన్నినట్లు నిర్థారించుకుని పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.