లక్కీ నెంబర్ 11.. ఆ సీటయితే .. సేఫేనా?
posted on Jun 15, 2025 6:36AM

ఆ సీటులో కూర్చుంటే...ఎంత ఘోర ప్రమాదం సంభవించినా, ఆ సీటులో కూర్చున్న ప్రయాణీకుడు ప్రాణాలతో బయట పడిపోతారు. అహ్మదాబాద్, విమాన ప్రమాదం తర్వాత పిచ్చపిచ్చగా ట్రెండ్ అవుతున్న వింతల్లో ఇదొకటి. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయట పడిన ఒకే ఒక్క అదృష్టవంతుండు విశ్వాస్ కుమార్ రమేష్ సీటు నెంబర్ 11. అందుకే, సీటు నెంబర్ 11 లక్కీ నెంబర్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎక్కడెక్కడి వో పాత కథలను తెచ్చి లింక్ చేస్తున్నారు.
ఇప్పడు తాజాగా.. 27 ఏళ్ల క్రితం సరిగ్గా ఇలాంటి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన థాయ్‌లాండ్ పౌరుడి సీటు నెంబర్ కూడా 11 కావడంతో.. లక్కీ నెంబర్ 11 స్టోరీ మరింతగా వైరల్ అవుతోంది. ఎప్పుడో 27 ఎలాల్ క్రితం, ఇలాంటి ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయట పడిన థాయ్‌లాండ్ పౌరుడు రాంగ్‌సాక్ లోచుసాక్, తను ప్రయాణించిన సీటు నెంబర్ కూడా 11 అని తెలిసి, అవక్కాయారు..ట.
అయితే, ఆహ్మదాబాద్ ప్రమాదానికి, అప్పుడు ఎప్పుడో 27 ఏళ్ళ క్రితం థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రమాదానికి మధ్య అంత గొప్ప పోలికలు ఏమీ లేవు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో, సీటు నెంబర్ 11లో కూర్చున్న ప్రయాణీకుడు తప్ప అందరూ చనిపోయారు.. కానీ, 1998 డిసెంబర్ 11న దక్షిణ థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రమాదంలో, ఒక్క రాంగ్‌సాక్ లోచుసాక్ మాత్రమే కాదు, మరో 45 మంది కూడా సురక్షితంగా బయట పడ్డారు. థాయ్‌లాండ్ విమానం నేలకూలిన సమయంలో,విమానంలో 146 మంది ఉన్నారు.వీరిలో 101 మంది చనిపోయారు. మిగిలిన 45 మంది ప్రాణాలతో బయట పడ్డారు. అందులో సీటు నెంబర్ 11 ప్రయాణీకుడు రాంగ్‌సాక్ లోచుసాక్ కూడా ఒకరు. విశ్వాస్‌ది కూడా తనలాగే 11ఏ సీటు అని తెలిసి రాంగ్‌సాక్ ఆశ్చర్యపోయారు. తనూ నాలాగే 11ఏ సీటులో ప్రయాణించాడు అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.
అయితే, ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాక కూడా తనను ఏదో తెలియని బాధ, చాలా కాలం పాటు వెంటాడిందని అన్నారు. ప్రమాదం తరువాత దాదాపు 10 ఏళ్ల పాటు తాను విమాన ప్రయాణం చేయలేదని తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడ్డాక పునర్జన్మ లభించినట్టు భావించానని తెలిపారు. ఇక విశ్వాస్ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. విమానంలో అంతా మృతి చెందినా తన ప్రాణాలు ఎలా నిలిచాయో తెలియట్లేదని అన్నారు. ఈ నేపథ్యంలో సీటు నెంబర్ 11ఉదంతం మిస్టరీగా మారింది. ఈ రెండు ప్రమాదాల్లోనూ 11 సీటులోని ప్యాసెంజర్‌లు క్షేమంగా బయటపడటం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.
అదొకటి అయితే,అహ్మదాబాద్, విమాన ప్రమాదంలో అనూహ్యంగా ప్రాణాలతో బయట పడిన విశ్వాస్ కుమార్ రమేశ్ ఉదంతంతో,ఒక్క ఇండియన్ ఎయిర్ లైన్స్’లోనే కాదు,అన్ని విమాన సేర్విసులలో సీటు నెంబర్ 11తో పాటుగా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు దగ్గరగా ఉన్న సీట్లకు ముందెన్నడూ లేనంత డిమాండ్ పెరుగుతోంది. అయితే, నిపుణులు మాత్రం, సీటు నెంబర్ కు సంబంధం లేదని అంటున్నారు. సీటు నెంబర్ 11 లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి దగ్గరగా ఉన్న సీటు అయితే సేఫ్ అనుకోవడం తప్పని అంటున్నారు. నిజానికి, విమానం విమానానికి సీటింగ్ అరెంజ్మేంట్ మారుతుంది. అలాగే ప్రమాదాలన్నీఒకేలా ఉండవు.. సో.. సీటు స్థానాన్నిబట్టి.. నెంబర్ బట్టి, ప్రమాదాల, చావు బతుకులు నిర్ధారణ కావని అంటున్నారు.
అయితే, ఎవరు ఎన్ని చెప్పినా, చివరకు, ‘దానే దానే పర్ ఖానే వాలాకా నామ్’లిఖా హువా హాయ్’ అంటే , తినే ప్రతి గింజపైన తినే వాడి పేరు రాసే ఉంటుందన్నదే నిజం., అందుకే, నూకలు చెల్లాయి అనే నానుడి పుట్టింది. లేకుంటే, లంచ్ చేసేందుకు కూర్చున్న వైద్య విద్యార్ధుల నెత్తిన విమానం కూలడం ఏమిటి? కంచాల ముందే 25 మందికి పైగా కన్నుమూయడం ఏమిటి?