పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికీ చెరశాల తప్పదా?

వైసీసీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేర సామ్రాజ్య పునాదులు కదిలిపోతున్నాయా? మిథున్ రెడ్డి అరెస్టు ఆ దిశగా తొలి అడుగా అంటే ఔననే సమాధానమే వస్తోంది. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి అరాచకత్వం హద్దులు లేనట్టుగా సాగింది. అధికారాన్ని అడుపెట్టుకుని ఆయన కబ్జాలు, దౌర్జన్యాలకు యథేచ్ఛగా పాల్పడ్డారన్న ఆరోపణలు వాస్తవమేని తేలుతోంది. జగన్ హయాంలో ఆయన హద్దూపద్దూ లేకుండా సాగించిన కబ్జా వ్యవహారాలన్నీ ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

అటవీ భూములను ఆక్రమణలపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన  అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల ద‌గ్దం కేసు విచారణలో పైళ్ల ద‌గ్దం ప్ర‌మాద‌శాత్తూ జరిగింది కాదని తేలింది.  ఆ ఫైళ్ల‌ దగ్ధం వెనుక ఉన్నది పెద్దిరెడ్డి అనుచరులేనని దర్యాప్తులో తెలడంతో ఆయన అనుచరులు అరెస్టు కూడా అయ్యారు. ఇలా పెద్దిరెడ్డి అక్రమాలు, దౌర్జన్యాలూ ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి.  ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆయన కుమారుడు, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ శనివారం (జులై 19) అరెస్టు చేయడంతో ఇక పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్య పునాదులు కదిలిపోయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇంత కాలం ఏం చేసినా ఎదురేలేదన్నట్లుగా సాగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం ఇక సాగడం లేదని ప్రస్ఫుటమైందని అంటున్నారు.   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు గతంలో చేసిన   అక్రమాలు అన్యాయాలు, దౌర్జన్యాలకు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు.  మద్యం కుంభకోణంలో మిధున్ రెడ్డి అరెస్టయ్యారనీ, అలాగే తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, తిరుపతిలో భూ కబ్జాల వ్యవహారంలో పెద్దిరెడ్డి అరెస్టు కూడా తప్పదని అంటున్నారు.