లాక్‌డౌన్ పొడిగింపు త‌ప్ప‌దా? కేబినెట్ భేటీ అందుకేనా?

తెలంగాణ‌లో లాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌లవుతోంది. రోజులో 20 గంట‌ల పాటు స‌క‌లం బంద్‌. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి ప‌ర్మిష‌న్‌ లేదు. అన‌వ‌స‌రంగా రోడ్డు మీద‌కు వ‌స్తే పోలీసులు తాట తీస్తున్నారు. వాహ‌నం సీజ్ చేసి.. భారీగా ఫైన్ వ‌సూలు చేస్తున్నారు. తెలంగాణ‌లో మే 30 వరకు ఇదే పరిస్థితి. ఆ తర్వాత ఏంటి? లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా? కాస్త‌ సడలింపులు ఇస్తారా? అదే చర్చ  జరుగుతోంది. లాక్‌డౌన్‌పై మే 30న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రి మండలి సమావేశం జ‌ర‌గ‌నుంది. 

రాష్ట్రంలో వ్యవసాయం, పంటలు, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం, కరోనా పరిస్థితి, లాక్ డౌన్ తదితర అంశాలపై కేబినెట్ చర్చించనుంది. వ్యవసాయంతో పాటు కరోనా కట్టడి, లాక్‌డౌన్‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రైతులంతా పంటలన కోశారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు ఎంత వరకు వచ్చాయి? ఇంకా ఎంత ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని సంబంధిత మంత్రులు, అధికారులను ఆరా తీయనున్నారు సీఎం కేసీఆర్. మరోవైపు వర్షాకాలం ప్రారంభం కాబోతుండ‌టంతో రైతులు ఇబ్బందులు పడకుండా విత్తనాలు, ఎరువుల లభ్యత గురించి కూడా చర్చిస్తారు.

వ్య‌వ‌సాయ‌మే ప్ర‌ధాన ఎజెండా అయినా.. రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితులపైనా కేబినెట్ చర్చించనుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కాస్త‌ తగ్గుముఖం పట్టింది. గతంలో 10వేలకు పైగా నమోదైన రోజూవారీ కరోనా కేసులు.. ఇప్పుడు 4వేల లోపే నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా 30వ లోపే ఉంటోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ఇంకా ఏం చేయాలో మంత్రులు చర్చించనున్నారు. అనంతరం లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటారు. అయితే, లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సడలింపులు ఇస్తే.. జనం విచ్చల విడిగా రోడ్ల మీదకు వస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే మళ్లీ కరోనా విజృంభింవచ్చని.. అందుకే మరికొన్నాళ్లు లాక్‌డౌన్ కొన‌సాగించ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఆంక్ష‌ల‌తో ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటున్నా.. క‌రోనా క‌ట్ట‌డే అన్నిటికంటే ముఖ్యం కాబ‌ట్టి.. లాక్‌డౌన్ వైపే మంత్రిమండ‌లి మొగ్గు చూపే అవ‌కాశ‌మే ఎక్కువ‌. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu