కేసీఆర్ యాక్ష‌న్‌.. పీకే డైరెక్ష‌న్‌..! గులాబీబాస్ కోసం ఐ ప్యాక్‌?

కేసీఆర్ ఇటీవలి ప్రశాంత్ కిశోర్‌ను తరుచూ కలుస్తున్నారు. పీకే సూచనల మేరకే భౌతిక దాడులు, ఆందోళనలకు కేసీఆర్ దిగుతున్నారు. ఈ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది మ‌రెవ‌రో కాదు. బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు ఇలాంటి కామెంట్లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారాయి. రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. 

నిజ‌మే. ఇటీవ‌ల కేసీఆర్ తీరు బాగా మారింది. మాట‌ల్లో ప‌దును పెరిగింది. చేత‌ల్లోనూ దూకుడు క‌నిపిస్తోంది. బీజేపీపై, కేంద్రంపై నాన్‌స్టాప్ బ్యాటింగ్ చేస్తున్నారు. బండి సంజ‌య్‌ను సిక్స‌ర్లు కొడుతున్నారు. వ‌రుస ప్రెస్‌మీట్ల‌తో క‌మ‌ల‌నాథుల‌పై క‌స్సున లేస్తున్నారు. బండిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేశాయి. ధ‌ర్నా చౌక్‌లో కేసీఆర్‌తో స‌హా మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్ష చేయ‌డం.. జిల్లాల్లో గులాబీ ద‌ళం ఆందోళ‌న‌లు.. ఇలాంటివి గ‌డిచిన ఏడేళ్ల‌లో ఎన్న‌డూ చూడ‌ని ప‌రిణామాలు. క‌ల‌బ‌డ‌ట‌మే తెలిసిన కేసీఆర్‌.. ఇలా దీక్ష‌ల‌తో దిగిరావ‌డం.. మాట‌ల‌తో తూట్లు పొడ‌వ‌డం.. ఆయ‌న స్టైల్ కానే కాదంటున్నారు. ఇక లేటెస్ట్ ప్రెస్‌మీట్‌లో కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డిపై తిట్ల దండ‌కం అందుకోవ‌డం.. ప్ర‌స్టేష‌న్ కాద‌ని.. అంతా ప‌క్కా ప్లాన్డ్ ఎపిసోడ్ అని అంటున్నారు. ఇంప్లిమెంట్ చేసింది కేసీఆరే అయినా.. ఆ ప్లాన్ చేసింది ప్ర‌శాంత్ కిశోర్ అనే అంటున్నారు. 

ఏపీలోనూ పీకే డైరెక్ష‌న్‌లో జ‌గ‌న్‌రెడ్డి అండ్ బ్యాచ్ ఇదే స్ట్రాట‌జీ ఫాలో అవుతోంది. చంద్ర‌బాబు ఇంటి ముట్ట‌డికి ప్ర‌య‌త్నించ‌డం, టీడీపీ కార్యాల‌యం విధ్వంసం, అసెంబ్లీలో చంద్ర‌బాబు భార్య‌ను కించ‌ప‌ర‌చ‌డం.. లాంటి చ‌ర్య‌లు ఆ దిక్కుమాలిన ఐ-ప్యాక్ ఇచ్చిన స‌ల‌హాలేన‌ని అంటున్నారు. పీకేకు చెందిన ఐ-ప్యాక్ సంస్థ‌ ఇలాంటి ప‌నికిమాలిన ఉద్రేకాలు రెచ్చ‌గొట్టడంలో ఎక్స్‌ప‌ర్ట్ అని చెబుతారు. గ‌తంలోనూ కాపు మీటింగ్ త‌ర్వాత తునిలో ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌ను త‌గ‌ల‌బెట్టడంలాంటి కుట్ర‌లు ఐ-ప్యాక్‌వే అంటారు. సేమ్ టూ సేమ్‌.. ఏపీ త‌ర‌హాలోనే తెలంగాణ‌లోనూ సీఎం కేసీఆర్ విప‌క్షంపై విరుచుకుప‌డుతుండ‌టం చూసి.. గులాబీ బాస్ వెన‌కాలా పీకేనే ఉన్నాడంటున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే.. ఇటీవ‌ల కాలంలో కేసీఆర్ త‌రుచూ ఢిల్లీ వెళుతుండ‌టం.. రోజుల‌కు రోజులు మ‌కాం వేయ‌డం.. ఎలాంటి రాజ‌కీయ కార్య‌క్ర‌మాలు లేకుండా కొన్ని రోజుల పాటు మాయం అవుతుండ‌టం.. పీకే టీమ్‌ను క‌లిసేందుకేన‌ని ఢిల్లీ వ‌ర్గాలతో మంచి లింకులున్న బీజేపీ నేత ర‌ఘునంద‌న్‌రావు అన‌డం నిజ‌మేన‌నిపిస్తోంది. 

కేంద్ర‌మంతి కిషన్‌రెడ్డిని కేసీఆర్ అంత దారుణంగా తిట్టాల్సిన అవసరం లేదని.. కావాల‌నే, ర‌చ్చ జ‌ర‌గాల‌నే ఇలా చేస్తున్నార‌ని అంటున్నారు. ఇదంతా పీకే డైరెక్ష‌న్‌లోనే జ‌రుగుతోంద‌ని.. త‌న వైఫ‌ల్యాలు, హుజురాబాద్ ఓట‌మి, ద‌ళిత‌బంధు అమ‌లు కాక‌పోవ‌డం, రేవంత్‌రెడ్డి ఎమ‌ర్జ్ కావ‌డం.. నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే పీకే చెప్పిన‌ట్టు చేస్తూ.. కేసీఆర్ బాగా దిగజారిపోతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.