చేరికలు తెలంగాణ బీజేపీకి వాపా.. బలమా?

సిద్ధాంతాలను పక్కన పెట్టేసి బలోపేతం పేరుతో వాపును పెంచేసుకున్న బీజేపీకి  ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ తొలి నుంచీ పార్టీనే నమ్ముకుని ఉన్న పాత నాయకులకు.. చేరికల పేరిట వచ్చి చేరిన నేతలకు అస్సలు పొసగడం లేదు. దీంతో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది.

బీజేపీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో  పార్టీలోకి చేరికలు ప్రోత్సహించడానికి ఏకంగా చేరికల కమిటీనే ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇన్ చార్జిగా బయట నుంచి వచ్చి చేరినఈటలను నియమించారు. అసలు బీజేపీలో చేరిన నాటి నుంచీ ఈటలకు పార్టీలో ఉక్కపోత మొదలైందన్న వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. అయినా సర్దుకుంటూ, సరిపెట్టుకుంటూ వచ్చిన ఈటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో మాత్రం సమన్వయం కుదరడం లేదని అంటున్నారు.  ఈ తరుణంలోనే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు అంటూ వార్తలు వస్తున్నాయి. తెరాస నుంచి బహిష్కృతులైనప్పటి నుంచీ కమలం గూటిగా, హస్తం గూటికా అని తేల్చుకోలేక సతమతమౌతూ వస్తున్న పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖరారైపోయింది.

వారలా ఖరారు చేసుకోవడానికి కొద్ది రోజుల ముందు ఈటల వారితో రహస్య భేటీ కావడం.. ఆ భేటీ తరువాత ఈటల స్వయంగా పొంగులేటి, జూపల్లిలు బీజేపీలో చేరే అవకాశం లేదని ప్రకటించడం, అంతటితో ఊరుకోకుండా వారే తనకు బ్రెయిన్ వాష్ చేశారని చెప్పడంతో ఈటల కూడా జంపై పోతారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అసలు ఈటల తెరాస నుంచి బయటకు వచ్చేసిన తరువాత.. ఆయనంతట ఆయన రాలేదనుకోండి.. కేసీఆర్ బయటకు పంపారు అది వేరే విషయం. అయితే అప్పట్లో ఆయన కాంగ్రెస్ ను కాదని బీజేపీలో చేరడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వామపక్ష భావజాలం ఉన్న ఈటల రాజేందర్ కాషాయ శిబిరంలో ఇమడగలరా అన్న అనుమానాలు అప్పట్లోనే వ్యక్త మయ్యాయి. సరే  ఆయన బీజేపీలో చేరడమే కాదు.. తన రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో  బీజేపీ అభ్యర్థిగా రంగంలో  నిలిచి భారీ మెజారిటీతో గెలిచారు.

అయితే ఆ విజయం పూర్తిగా ఈటల వ్యక్తిగత విజయంగా అప్పట్లో పరిశీలకులు అభివర్ణించారు. అయితే ఎలా గెలిచినా ఆ స్థానం బీజేపీ ఖాతాలోనే పడింది అది వేరే సంగతి. ఆ విజయంతో రాష్ట్రంలో ఈటల ఎంత ప్రభావం చూపగలరో బీజేపీ హై కమాండ్ కు బాగా అర్ధమైంది. అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆయనకు పొసగకపోయినా.. విభేదాలు పలుమార్లు రచ్చకెక్కినా.. ఈటల ప్రాధాన్యత బీజేపీల ఇసుమంతైనా తగ్గలేదు.  అయితే అప్పటి నుంచీ కూడా బండి, ఈటల మధ్య సమన్వయం కుదిర్చే విషయంలో బీజేపీ హై క మాండ్ మల్లగుల్లాలు పడుతూనే ఉంది.

 బండి సంజయ్ ను మార్చాల్సిందేనని బయట నుంచి వచ్చి పార్టీలో చేరిన నేతలు గట్టిగా పట్టుబడుతుండటంతో బీజేపీ అగ్రనాయత్వం దిక్కు తోచని స్థితిలో ఉంది. ఎవరిపైనైనా చర్య తీసుకుంటే.. కర్నాటక ఎన్నికల ముందు రాలినట్లు తెలంగాణ కమలంలో కూడా చాలా రేకలు రాలిపోతాయన్న భయం వారిని పట్టి పీడిస్తోంది.  అందుకే మరోసారి  ఈటల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించుకుంది.  మరి ఈ సారి ఈటలను ఎలా సముదాయిస్తారో చూడాల్సి ఉంది. మొత్తం మీద గెలుపు ధీమా  బీజేపీలో సన్నగిల్లిందనడానికి ఇటీవలి పరిణామాలు తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu