బాలయ్య.. ప్రజాసేవ, సినిమా

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుమారుల్లో  ఆయన నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని.. నేటికీ ఆ వారసత్వాన్ని కొసాగిస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే.. అది నందమూరి బాలకృష్ణ అన్నది సుస్పష్టం. అలాగే ఎమ్మెల్యేగా, సామాజిక బాధ్యత గల వ్యక్తిగా ఆయన అనుసరిస్తున్న మార్గం.. పలువురికి సర్వదా అనుసరణీయం. అలాంటి బాలయ్య జన్మదినం శనివారం (జూన్ 10). ఈ ఏడాది ఆయన 63వ సంవత్సరంలోకి అడుగు పెడతారు.  

నందమూరి బాలయ్యకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన సినిమా విడుదలవుతోందంటే.. ఆయన అభిమానులకు నిజంగా పండగే పండగ. ఆయన డైలాగ్ డెలివరీ అయినా.. డ్యాన్స్ సెప్ట్‌లు వేసిన.. ఛేజింగ్ సీన్స్‌లో దూసుకెళ్లినా బాలయ్యకు బాలయ్య బాబే సాటి. అలాగే పౌరాణికం, సాంఘికం, రాజకీయం ఏ సినిమా అయినా.. అది ఒక కళాఖండమే. అలాగే ఓటీటీ వేదికగా వచ్చిన.... వస్తున్న అన్‌స్టాపబుల్ కార్యక్రమం సైతం సూపర్ డూపర్ హిట్టే. 

ఇక హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గ ప్రజలకు చేస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు. అటు అన్నా క్యాంటీన్లను   బాలయ్య బాబు ఏర్పాటు చేశారు. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరుతో.. నియోజకవర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలను   అందిస్తున్నారు. ఇక బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాలయ్య బాబు.. అందిస్తున్న సేవలు అపూర్వం, అనితర సాధ్యం. ప్రముఖ మ్యాగజైన్ అవుట్ లుక్ నిర్వహించిన ఓ సర్వేలో దేశంలో రోగులకు సేవలందిస్తున్న అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా ఈ బసవ తారకం ఆసుపత్రి రెండో స్థానంలో నిలిచిందని ప్రకటించింది. దీంతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు బాలకృష్ణ ఎంత అంకితబావంతో సేవలందిస్తున్నారో  అర్థమవుతోంది. అలాగే ఈ ట్రస్ట్ తరఫున బ్లడ్ బ్యాంక్ సైతం నిర్వహిస్తున్నారు.  

ఆయనకు 23 ఏళ్ల వయస్సులో తండ్రి ఎన్టీఆర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన బావ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పని చేశారు. గత 39 ఏళ్లలో 22 ఏళ్ల ముఖ్యమంత్ర పీఠం ఆ ఇంటిదేనన్నది సుస్పష్టం. 

ఇద్దరు బావలు ఎమ్మెల్యేలు అయినా.. సొంత సోదరుడు నందమూరి హరికృష్ణ పెద్దల సభలో సభ్యుడిగా ఉన్నా.. రక్తం పంచుకు పుట్టిన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర మంత్రిగా చక్రం తిప్పినా.. మొత్తంగా చూస్తే.. గత 40 ఏళ్ళుగా.. మధ్యలో 1989 నుంచి 1994 వరకూ తప్ప అధికారం ఆయనింటి గడప దాటలేదన్న విషయం తెలిసిందే. ఇంతగా ఇంతలా ఈ ఫ్యామిలీ పాలిటిక్స్‌లో ఉన్నా.. ఈ రోజు వరకు ఒక్క అణా పైసా అవినీతి ఆరోపణ కానీ,  అధికార దుర్వినియోగం చేసినట్లు విమర్శలు కానీ లేక పోవడం గమనార్హం.

 ఎక్కడో దూరపు చుట్టం, వరుసకు సోదరుడు,  వేలు విడచిన బామర్ది రాజకీయాల్లో ఉంటేనే ఈ రోజుల్లో వాళ్ళు హడావిడి, వాళ్ల సంపాదన ఎలా ఉంటుందో చూస్తున్నాం. అలాగే చిన్న చిన్న హీరోలు కూడా బౌన్సర్లను పెట్టుకుని వీర బిల్డప్‌తో చలామణి అవుతోన్న ఈ రోజుల్లో ఎటువంటి హడావిడి లేకుండా తిరిగే ఏకైక అగ్ర హీరో..   నందమూరి బాలకృష్ణ. వృత్తి, రాజకీయాలు, బాధ్యతతో కూడిన సమాజ సేవ మధ్య స్పష్టమైన సమన్వయంతో ముందుకు సాగుతూ సమకాలీన హీరోల్లో ముందుండే ఒకే ఒక్క పేరు బాలయ్య బాబు. అయితే బాలయ్య బాబు చేత్తో చెంపమీద కొడతారేమో గాని కడుపు మీద కొట్టడు అని ప్రత్యర్ధులు సైతం చెబుతుంటారంటే ఆది ఆయన మంచితనానికి అసలు సిసలు నిదర్శనం.   

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న 108వ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి భగవంత్ కేసరి అనే పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్ టాక్ ఆప్ ది టాలీవుడ్‌గా మారింది. 

అలాగే బాలయ్య బర్త్ డే జూన్ 10వ తేదీ. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ ఘనంగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్యాన్సర్ ఆసుపత్రి వద్ద రోగులకు పండ్లు పంపిణి చేయనున్నారు. అలాగే పేదలకు అన్నదానంతోపాటు ఫ్యాన్స్ రక్తదాన శిబిరాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు. 

ఇక బాలయ్య నటించిన సూపర్ డూపర్ హిట్ సాధించిన సినిమాల్లో ఒకటైన ‘నరసింహనాయుడు’ చిత్రాన్ని ఆయన జన్మదినం సందర్బంగా 4కె టెక్నాలజీలో రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోల జన్మదినం సందర్భంగా.. వారు నటించిన హిట్ చిత్రాల్లో ఒక చిత్రాన్ని ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా మలిచి.. రీ రిలీజ్ చేస్తున్న విషయం విదితమే. ఆ క్రమంలో ‘నరసింహనాయుడు’ చిత్రం విడుదల కానుంది. ఈ నందమూరి నటసింహాన్ని టాలీవుడ్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ అని ముద్దుగా పిలుచుకొంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే భవిష్యత్తులో బాలయ్య మరిన్ని చిత్రాల్లో హీరోగా నటిస్తూనే.. ఎమ్మెల్యేగా ప్రజా సేవలో దూసుకుపోవాలని ఆయనకు ఫ్యాన్స్ .. బర్త్ డే విషెష్ చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu