బీజేపీ అధ్య‌క్షుడిగా ఈట‌ల‌!.. బండి పోస్టు ఊస్టేనా?

ఈట‌ల రాజేంద‌ర్‌. తెలంగాణ‌లో సంచ‌ల‌నం. హుజురాబాద్ గెలుపుతో కేసీఆర్‌కు స‌రైన మొన‌గాడ‌ని నిరూపించుకున్న నేత‌. అరంగేట్రంతోనే బీజేపీలో టాప్ లీడ‌ర్‌గా ఎదిగిన నాయ‌కుడు. అందుకే, ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా.. బీజేపీలో అధిక ప్రాధాన్యం ల‌భిస్తోంది. ఒక్క గెలుపుతో అధిష్టానం దృష్టిలో ప‌డ్డారు. ఎమ్మెల్సీ పోటీలో ర‌వీంద‌ర్‌సింగ్‌ను బ‌రిలో నిలిపి ఢిల్లీ దృష్టిని ఆకర్షించారు. కావ‌ల‌సినంత ఆర్థిక బ‌లం. అంతులేని అనుచ‌ర గ‌ణం. ఉద్య‌మ నేత‌గా అభిమాన ద‌ళం. ప్ర‌భుత్వంలో, పాల‌న‌లో సుదీర్ఘ అనుభవం. ఇవి చాల‌వా ఈట‌ల రాజేంద‌ర్‌ను మ‌రింత ఎత్తుకు తీసుకెళ్ల‌డానికి. ఇప్పుడ‌దే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈట‌ల రాజేంద‌ర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా నియ‌మిస్తారంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. 

మ‌రి, స్టేట్ ప్రెసిడెంట్‌గా బండి సంజ‌య్ ఉన్నారుగా అనే అనుమానం రావొచ్చు. ఆ.. ఉన్నారు.. అంత‌కుముందు కె.ల‌క్ష్మ‌ణ్ కూడా ఉన్నారుగా. అలానే, ఇప్పుడు బండి సంజ‌య్ ఉన్నారు. బీజేపీ వ్య‌క్తుల పార్టీ కాదు. సిద్ధాంత పార్టీ. ద‌మ్మున్న పార్టీకి ద‌మ్మున్న లీడ‌రే కావాలి. ఆ ద‌మ్ము ఇప్పుడు ఈట‌ల‌లో చూస్తున్నారు. బండి సంజ‌య్ దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నా.. కేసీఆర్ కొమ్ములు వంచాలంటే ఆయ‌న బ‌లం స‌రిపోవ‌ట్లేద‌ని అంటున్నారు. బీజేపీ అధ్య‌క్షుడు కాక‌ముందు బండికి అంత‌గా బ్యాక్‌గ్రౌండ్ లేదు. వాక్‌చాతుర్యంలో కేసీఆర్ ముందు నిల‌వ‌లేక‌పోతున్నారు. హైద‌రాబాద్‌కే ఎక్కువ‌గా ప‌రిమితం అవుతున్నార‌నే ఆరోప‌ణ ఉంది. స‌బ్జెక్ట్ మీద అంత‌లా ప‌ట్టు ఉండ‌దు. మ‌రీ, ముఖ్యంగా అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం లేద‌ని.. బండి సంజ‌య్ వ‌చ్చాక పార్టీలో గ్రూపులు బాగా పెరిగిపోయాయ‌ని చెబుతున్నారు. అందుకే, బండికి అల్ట‌ర్నేట్‌గా ఈట‌ల‌ను అధ్య‌క్ష పీఠంపై కూర్చోబెట్ట‌బోతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. 

అదే, బండి సంజ‌య్ వ‌ల్ల బీజేపీలో గ్రూపులు కుమ్ములాట‌లు పెరిగాయ‌ని అంటున్నారు. కిష‌న్‌రెడ్డి వ‌ర్సెస్ బండి సంజ‌య్ ఎపిసోడ్ పార్టీలో అంద‌రికీ తెలిసిందే. వివేక్‌కు సైతం బండితో పొస‌గ‌డం లేద‌ని.. విభేదాలు మ‌రింత ముదిరితే వివేక్ మ‌ళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతార‌ని టాక్‌. ఇలా బీజేపీలో బ‌ల‌మైన నాయ‌కులకు బండితో తేడాలొచ్చాయ‌ని.. వారంతా క‌లిసి ఈట‌ల రాజేంద‌ర్ పేరును అధిష్టానం ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తున్నార‌ని తెలుస్తోంది. ధ‌ర్మ‌పురి అర్వింద్ సైతం అధ్య‌క్ష రేసులో ఉన్నా.. ఆయ‌న‌కు ఏ కేంద్ర మంత్రి ప‌ద‌వో ఇస్తారు కానీ.. ఈట‌ల‌నే స్టేట్ ప్రెసిడెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని స‌మాచారం. 

ఉద్య‌మ నాయ‌కుడిగా కేసీఆర్‌తో స‌మాన స్థాయి ఉండ‌టం.. ప్ర‌జ‌ల్లో మంచి ఇమేజ్‌.. మంచి వాగ్ధాటి..  ఈట‌ల‌కు బాగా అనుకూలించే అంశాలు. హుజురాబాద్ ఎన్నిక‌ల్లో యావ‌త్ అధికార ఘ‌నానికీ ఎదురు నిలిచి పోరాడి గెలిచిన యోధుడు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ రెబెల్‌తో కారు పార్టీకి చెమ‌ట‌లు ప‌ట్టించిన రాజ‌కీయ చాణ‌క్యం. కేసీఆర్ గుట్టు మ‌ట్లు అన్నీ తెలిసిన నాయకుడు. గులాబీ ద‌ళాన్ని చీల్చ‌గ‌ల స‌త్తా ఆయ‌న సొంతం. అందుకే కేసీఆర్‌కు చెక్ పెట్టాలంటే ఈట‌ల‌నే క‌రెక్ట్ ప‌ర్స‌న్ అని అంచ‌నా వేస్తున్నారు. 

ఇక‌, ఇటు కిష‌న్‌రెడ్డితోనూ స‌త్సంబంధం.. అటు వివేక్ వెంక‌ట‌స్వామి, ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే ర‌ఘునంద‌ర్‌రావు లాంటి వాళ్ల‌తో సాన్నిహిత్యం.. ఈట‌ల‌కు క‌లిసొచ్చే విష‌యాలు. పార్టీలో గ్రూపులు ప్రోత్స‌హించ‌డం.. హుజురాబాద్‌లో ఈట‌ల గెలుపున‌కు బండి సంజ‌య్ అంత‌గా స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం.. ఇటీవ‌లి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కావాల‌నే ఓటు వేయ‌క‌పోవ‌డం.. లాంటి ప‌రిణామాల‌పై బండికి వ్య‌తిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేరాయ‌ని తెలుస్తోంది. ఇలా, బండి సంజ‌య్ బ‌ల‌హీన‌త‌లు.. ఈట‌ల రాజేంద‌ర్ బ‌లాలుగా మారి.. త్వ‌ర‌లోనే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఈట‌ల నియామ‌కం జ‌ర‌గ‌నుంద‌ని బీజేపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. 

అయితే, ఆర్ఎస్ఎస్ వాది కాని వారికి ఆ ప‌ద‌వి ద‌క్కుతుందా అనే అనుమానం అక్క‌ర‌లేదంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా చేయ‌లేదా? ఇక్క‌డా అంతే. అంగ‌, అర్థ బ‌లాల‌తో పాటు కేసీఆర్‌ను ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌నే క‌సి, ప‌ట్టుద‌లే.. ఈట‌ల‌ను అధ్య‌క్ష పీఠానికి ద‌గ్గ‌ర చేస్తోంద‌ని చెబుతున్నారు.  త్వ‌ర‌లోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులుగా ఈట‌ల రాజేంద‌ర్ నియామ‌కం జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu