17 నుంచి ఐపీఎల్ షురూ!
posted on May 13, 2025 11:14AM
.webp)
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తదననంతర పరిణామాల నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొనడంతో అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభం కానుంది. ఇందుకు తేదీలు కూడా ఖరారైపోయియా. ఇరు దేశాల మధ్యా కాల్పుల విరమణకు ఒప్పందం కుదరడం, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సడలిపోవడంతో ఐపీఎల్ ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 17 నుంచి ఐపీల్ తిరిగి మొదలౌతుంది. అయితే ఐపీఎల్ మ్యాచ్ లను ఈ సారి ఆరు వేదికలకే పరిమితం చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఈ సవరించిన షెడ్యూల్ ప్రకారం మే 17 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభమౌతాయి. ఐపీఎల్ అర్ధంతరంగా నిలిచిపోయే సమయానికి ఈ టోర్నీలో ఇంకా 17 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఇప్పుడు ఆ 17 మ్యాచ్ ల కోసం ఏంపిక చేసిన ఆరు వేదికలలో జైపూర్, ముంబై, లక్నో, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ ఉన్నాయి. పాక్‌తో ఉద్రిక్తతల నడుమ దక్షిణాది రాష్ట్రాలకే బీసీసీఐ మొగ్గు చూపుతుందని భావించినా బెంగళూరు తప్ప మరే దక్షిణాది రాష్ట్రాన్నీ బీసీసీఐ ఎంపిక చేయలేదు. అయితే ప్లేఆఫ్ మ్యాచ్ లు రెండు, ఫైనల్స్ కు ఇంకా వేదికలను బీసీసీఐ నిర్ణయించలేదు.