లారీ ఇసుక ధర రూ.30వేలు!
posted on May 2, 2012 9:49AM
రాష్ట్రంలో హఠాత్తుగా ఇసుకకు కొరత ఏర్పడింది. ఈ కొరత ఇసుక సిండికేట్లకు వరంగా మారింది. రాష్ట్ర హైకోర్టు ఇసుకతవ్వకాలను నిలిపివేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. అయితే ఇసుక సిండికేట్లు ఈ ఇసుక నిషేధాలను తెలివిగా తమకు అనుకూలంగా ఉపయోగించు కున్నారు. హైకోర్టు ఉత్తర్వ్యుఅలు అమలులోకి రావటానికి నెలరోజుల ముందునుంచే ఈ సిండికేట్లు పెద్దఎత్తున ఇసుకను నిల్వచేసుకుని శ్యాండ్ బ్యాంక్ లు ఏర్పాటు చేసుకున్నాయి.
రాష్ట్రంలో అనేకచోట్ల ఖాళీస్థలాల్లో ఇసుకను గుట్టలు, గుట్టలుగా నిల్వ ఉంచారు. హైకోర్టు ఉత్తర్వుల కారణంగా తవ్వకాలు నిలిచిపోయాక ఇసుకసిండికేట్లు ఇసుకధారాలను హఠాత్తుగా పెంచేశారు. ప్రస్తుతం వీరు పది టైర్ల లారీ ఇసుకను రూ. 30వేల రూపాయలకు, టిప్పర్ ఇసుకను రూ. 20వేలకు, ట్రాక్టర్ ఇసుక ఆరువేల రూపాయలకు విక్రయిస్తున్నారు. సిమ్మెంటు బస్తాలో పట్టేంత ఇసుకను రూ. 70 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో నిర్మాణరంగంలో ఉన్నవారు ఇసుక ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని చోట్ల ఇసుక కొరత కారణంగా నిర్మాణాలు కూడా నిలిపివేశారు. మరో నెల వరకూ ఇసుక తవ్వకాలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.