స్టార్లూ... యాడ్స్ చేసే ముందు జర జాగ్రత్త..!


ఇండియాలో సినీ నటులకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెరవేల్పుల్ని ఇలవేల్పులుగా పూజిస్తారు ఇక్కడి అభిమానులు. వాళ్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకుని తమ వాల్యూ పెంచుకోవాలనుకుంటాయి బడా కంపెనీలు. ఈ విధంగా ఒక చేత్తో సినిమాలు..మరో చెత్తో యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదించేస్తుంటారు మన సెలబ్రెటీలు. అయితే ఇక నుంచి యాడ్స్ చేసే ముందు కాస్తా ఆలోచించి చేయాలని అలర్ట్ చేసింది భారత పార్లమెంట్. మ్యాగీ నూడిల్స్ వివాదం తరువాత కంపెనీల ఉత్పత్తుల ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న వారికి మరింత బాధ్యత పెరిగింది. తప్పుడు ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేసే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. నేషనల్ అవార్డ్స్ విన్నర్స్, సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్‌ను బట్టి, వారు తప్పుడు ప్రకటనలు చేస్తున్నా వినియోగదారులు గుడ్డిగా నమ్మేస్తున్నారని కమిటీ పేర్కొంది. బ్రాండ్లను ఎండార్స్ చేసే ముందు కాంట్రాక్ట్‌పై సంతకం చేసే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. కల్తీ ఆహార పదార్థాలను మంచివిగా తప్పుడు ప్రకటనలు చేస్తే మాత్రం కఠినమైన శిక్షలు తప్పదు. ఇవి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఇలాంటి ఉత్పత్తులను ఎండార్స్ చేసే వారికి మొదటిసారి 10 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష. రెండోసారి కూడా తప్పుడు ప్రకటనలు చేస్తే 50 లక్షల జరిమానా, ఐదేళ్లు జైలు శిక్ష విదిస్తారు. సో..బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఏ వుడ్ స్టార్స్ అయినా డబ్బులు, పేరు వస్తుందని అడ్డమైన ప్రకటనల్లో నటించకండి..మీ భద్రతతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాస్త పట్టించుకోండి.