పైసలు లేకుండా పార్టీ ఎలా "సర్దార్"

సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వివిధ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు అన్ని వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతానని..జనసేనను రణరంగంలోకి దించుతానని చెప్పారు. ఇదంతా ఒక ఎత్తైతే నాకు నెల గడవటానికే ఇబ్బందిగా ఉంది. కనీసం పనివాళ్లకు కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నానంటూ పవన్ తన ఆర్థిక కష్టాలు వెల్లడించారు. మరి రాజకీయాలను డబ్బు శాసిస్తున్నప్రస్తుత కాలంలో పైసలు లేకుండా పవన్ పార్టీని ఎలా నడుపుతారు.

 

అధికారం, రాజకీయం, పార్టీ ఫిరాయింపులు, లాలూచీలు, లాబీయింగ్‌లు, లాలూచీలు, కాంట్రాక్ట్‌లు ఇంకా అనేకానేక సంఘటనల తీగలాగి చూస్తే ఆ చివర కనిపించేది డబ్బే. రాజకీయం అంటే సంపాదనకు పర్యాయ పదంలా మారింది. రాజకీయాల్లో ఉన్నాడు అని ఎవరైనా అంటే అది ఉపాధి మార్గంగానే చూడాల్సి వస్తోంది. సిద్ధాంతాలు నచ్చలేదు..నియోజకవర్గ అభివృద్ధి కోసం మారుతున్నా..ప్రజల కోసమే మారుతున్నా అంటే జనం ఫక్కున నవ్వుతున్నారు. అంటే ఏ మేరకు డబ్బు మూటలు చేతులు మారాయో అని లెక్కలు వేస్తున్నారు జనం.

 

పార్టీ మారడానికి డబ్బులు తీసుకోకపోవచ్చు అధికారం అందుతుందిగా. అది చాలు వ్యాపారాలు చేసుకోవడానికి, డబ్బు సంపాదించడానికి. డబ్బు చుట్టూ రాజకీయం నడుస్తున్న సిచ్యువేషన్‌లో నా దగ్గర డబ్బు లేదు అంటే ఎవరైనా పవన్ దారిలో నడుస్తారా? ప్రచారం చెయ్యాలంటే డబ్బు, ఓట్లు కొనాలంటే డబ్బు ఇలా ప్రతిదానికి పార్టీ తరపు నుంచో లేదా అభ్యర్థి సొంత ఖజానా నుంచో ఖర్చు పెట్టాలి. పవన్ నిఖార్సైన మనుషుల్ని అభ్యర్థులుగా నిలబెట్టారనే అనుకుందాం..కాని వారిని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రచారం కావాలి దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. కోట్ల రూపాయలు ఉండి కూడా గెలవలేకపోతుంటే అసలు డబ్బే లేకుండా ఎన్నికల బరిలోకి దిగి గెలిచేది ఎవరు? పవన్ క్రేజ్ జనాన్ని రోడ్ల మీదకి తెస్తుంది కాని వాళ్లతో ఓట్లు వేయించలేదు. ఈ సత్యాన్ని పవన్ త్వరగా తెలుసుకుంటే మంచిది. లేదంటే పవన్ ఈ ప్రకటన వెనుక వేరే లాజిక్ ఏమైనా ఉందా అనేది త్వరలోనే తెలుస్తుంది.