పాక్ కవ్వింపులు.. దీటుగా భారత్ బదులు!
posted on Apr 24, 2025 1:27PM

కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల కిరాతక దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలకు సిద్ధం అయ్యింది. ప్రాథమికంగా కొన్ని చర్యలను తీసుకుంది. అందులో భాగంగా దేశ సరిహద్దులను మూసే సింది. వివిధ పనుల నిమిత్తం ఇండియాకు వచ్చిన పాక్ జాతీయులు మే ఒకటవ తేదీ లోగా భారత్ విడిచి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పెహల్గాంలో పర్యాటకులు లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి అనంతరం భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో భేటీ అయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల మేరకు అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మూసివేసింది. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్‌కు వచ్చిన, ఇక్కడ నివసిస్తోన్న పాకిస్తానీయులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. వీసా గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. మే 1 తేదీ లోపలే వాళ్లంతా కూడా భారత్‌ను వదిలి పాకిస్తాన్‌కు వెళ్లి పోవాల్సి ఉంటుంది. అయితే వారు దేశం విడిచి వెళ్లాలంటే అట్టారీ - వాఘా చెక్ పోస్టు ఒక్కటే మార్గం. దీని ద్వారా మాత్రమే అధికారికంగా సరిహద్దు దాటాల్సి ఉంటుంది. దానిని మూసివేయడంతో ఇప్పుడు ఇక్కడ ఉన్న పాకిస్థానీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
గడువు దాటిన తరువాత కూడా ఇక్కడే ఉండే పాకిస్తానీయులు జైలుకు వెళ్లక తప్పదు. ఇక ఇప్పుడు వారు అనివార్యంగా తాము తిరిగి వెళ్లడానికి కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. వీసా ఉంది కదా అన్న ధైర్యంతో అడ్రస్ లు మార్చి దేశంలో తిరిగే అవకాశం ఇసుమంతైనా లేదు. అదే విధంగా సింధు జలాల ఒప్పందాన్ని (ఇండస్ ట్రీటీ) రద్దు చేసింది. పాకిస్థాన్ తో అన్ని రకాల సంబంధాలనూ తెంచేసింది. భారత్‌లో ఉన్న పాకిస్తాన్ హైకమిషనర్‌కు కూడా మే 1వ తేదీ లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. సీసీఎస్‌లో తీసుకున్న నిర్ణయాలతో ఒక అధికారిక పత్రాన్ని ఆయనకు అందజేసింది.
ఇక పాకిస్తాన్‌లో కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. పెహల్గాం ఉగ్ర దాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో భయానక వాతావరణం నెలకొంది. భారత్ నిర్ణయాలపై ఎలా స్పందించాలన్న విషయంపై అక్కడ ప్రభుత్వం కిందా మీదా పడుతోంది. కవ్వింపు చర్యలకు దిగుతోంది. అందులో భాగంగానే ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను ఛేదించే క్షిపణి పరీక్షలకు నడుంబిగించింది. కరాచీ తీర ప్రాంతంలో రెండు రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు భారత్ కు సమాచారాన్ని అందించింది. ఇందు కోసం తీరప్రాంతంలో నౌకాదళ సిబ్బందిని మోహరించింది. దీనిపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామనీ, పాక్ క్షిపణి పరీక్షలపైనా నిఘా ఉంచామనీ పేర్కొంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సర్వసిద్ధంగా ఉందని పేర్కొంది.