ముంబయి టెస్టు మనదే! రికార్డ్ గెలుపు ముంగిట కోహ్లీ సేన...

న్యూజీలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ పూర్తి పట్టు బిగించింది. ముంబై టెస్టులో కోహ్లీసేన గెలుపు ముంగిట నిలిచింది. కివీస్ ముందు 540 పరుగుల లక్ష్యాని ఉంచిన టీమిండియా.. విజయానికి మరో 5 వికెట్ల దూరంలో నిలిచింది. భారీ లక్ష్యఛేదనకు బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 400 పరుగులు చేయాలి. చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో అది సాధ్యమయ్యే పని కాదు. ఆటకు ఇంకా రెండ్రోజుల సమయం మిగిలుండగా, డ్రా కోసం ఆడడం కూడా కివీస్ కు శక్తికి మించిన పనే. 

మూడో రోజు ఆట ముగిసే సమయానికి హెన్రీ నికోల్స్ 36, రచిన్ రవీంద్ర 2 పరుగులతో క్రిజులో ఉన్నారు. వన్ డౌన్ లో వచ్చిన డారిల్ మిచెల్ 60 పరుగులు చేశాడు. తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ 6, ఓపెనర్ విల్ యంగ్ 20, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ 6 పరుగులు చేశారు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టామ్ బ్లండెల్ (0) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.

ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేయగా, కివీస్ 62 పరుగులకు ఆలౌటైంది. భారత్ కు కీలకమైన 263 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం తన రెండో ఇన్నింగ్స్ ను భారత్ 276/7 వద్ద డిక్లేర్ చేసి కివీస్ ముందు 500 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత రెండో ఇన్నింగ్స్ లోనూ మయూంక్ అగర్వార్ విజృంభించాడు. 62 పరుగులు చేసి అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో మయూంక్ 150 రన్స్ చేశాడు .ఇక సెకండ్ ఇన్నింగ్స్ చివరలో అక్షర్ పటేల్ ధాటీగా ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. భారత్ తరపున తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధిస్తాడని అనుకుంటుండగా.. ఏడో వికెట్ గా జయంత్ అవుట్ కావడంతో ఇన్నింగ్స్ ను కెప్టెన్ విరాట్ కోహ్లీ డిక్లేర్ చేశాడు.