60 లక్షల ఓట్లు.. సర్కార్ ను కూల్చేస్తం! ఏపీఎన్‌జీవో నేత కామెంట్ల కలకలం.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగులు రగిలిపోతున్నారు. పీఆర్సీ సహా పెండింగ్ సమస్యలను పరిష్కారానికి ముందుకు రావడం లేదనే ఆగ్రహంతో ఉన్నారు. రెండున్నర ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు.. ఇక ఊరుకునేది లేదంటూ ఉద్యమ బాట పడుతున్నారు. ఈనెల 1వ తేదిన సీఎస్ సమీర్ శర్మకు నోటీసు ఇచ్చారు. అందులో తమ డిమాండ్ల పరిష్కారానికి వారం రోజుల గడువు ఇచ్చింది ఉద్యోగ సంఘాల జేఏసీ. తర్వాత ప్రభుత్వ స్పందనను బట్టి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. జగన్ సర్కార్ తో తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు ఏపీ ఉద్యోగులు. తమ సహకారం వల్లే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందని చెబుతున్నారు. 

జగన్ సర్కార్ పై అన్ని వర్గాల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరుగుతుండగానే.. తాజాగా వైసీపీ ప్రభుత్వ తీరుపై  ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడా వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘నేను విన్నాను..నేను ఉన్నాను..చెప్పిన మాయ మాటలు విని..151 సీట్లు తీసుకొని వచ్చామని ఆయన అన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.. అటువంటిదే.. ఈ పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లని విమర్శించారు. ఉద్యోగుల పరిస్థితేంటో చంద్రబాబుకు బాగా తెలుసునని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్కొక్క ఉద్యోగికి 5 ఓట్లు ఉంటాయన్నారు. ఆ  లెక్కన సుమారు 60 లక్షలకుపైగా ఓట్లు ఉంటాయని, ప్రభుత్వాన్ని కూల్చవచ్చని అన్నారు. ఈ శక్తి ముందు ఎవరైన తలవంచాల్సిందేనని బండి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు.

ఏపీ ఎన్జీవో నేత మాట్లాడిన మాటల ఇప్పుడు సంచలనంగా మారాయి. వైసీపీలో గుబులు రేపుతున్నాయి. బండి శ్రీనివాస రావు ఒక్కరే కాదు ఉద్యోగులందరి అభిప్రాయం ఇలానే ఉందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించకపోతే ఎంతవరకైనా వెళ్లేందుకు ఉద్యోగులు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఏం చేయబోతోంది, ఉద్యోగ సంఘాల జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.