అక్షర్ పటేల్ కు ఐదు వికెట్లు.. భారత్ కు 49 పరుగుల లీడ్

న్యూజీలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పట్టు సాధించింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్సులో భారత్ కు 49 పరుగుల కీలక ఆధిక్యత లభించింది. టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌటైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 5 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజాకు 1, అశ్విన్ కు 3 వికెట్లు లభించాయి. పేసర్ ఉమేశ్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది. టెస్టుల్లో 5 వికెట్లు తీయడం అక్షర్ కు ఇది ఐదోసారి. 

 129 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట షురూ చేసి కివీస్.... 151 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 89 పరుగులు చేసిన ఓపెనర్ విల్ యంగ్ అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. తర్వాత కివీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ టామ్ లాథమ్ 95 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. శుక్రవారం ఆటలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన టీమిండియా స్పిన్నర్లు... మూడు రోజు  రెండో సెషన్ లో చెలరేగిపోయారు. అక్షర్ పటేల్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో కివీస్ తడబడ్డారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 18, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ 11, కైల్ జేమీసన్ 23 పరుగులు చేశారు. భారత సంతతి కుర్రాడు రచిన్ రవీంద్ర (13)ను రవీంద్ర జడేజా బౌల్డ్ చేశాడు. 

49 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్సులో ఆదిలోనే తడబడింది.  ఓపెనర్ శుభ్ మాన్ గిల్ వికెట్ త్వరగా కోల్పోయింది. ఒక పరుగు చేసిన గిల్... జేమీసన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా ఉన్నారు. దీంతో భారత్ కు 63 పరుగుల లీడ్ తో ఉంది. ఈ మ్యాచ్ లో నాలుగో రోజు ఆట కీలకంగా మారింది. భారత్ జట్టు టీ విరామ సమయం వరకు బ్యాటింగ్ చేసి.. 3 వందలకు పైగా టార్గెట్ కివీస్ ముందు ఉంచింతే గెలిచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.