పాక్, చైనాలతో సరిహద్దు ఘర్షణలు శాశ్వితం?

 

పాకిస్తాన్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడిన ప్రతీసారి, పాకిస్తాన్ ప్రభుత్వం తన ప్రజల దృష్టిని మళ్ళించేందుకు భారత్-పాక్ సరిహద్దులలో కాల్పులకు తెగబడటం పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ లో అటువంటి పరిస్థితే నెలకొని ఉండటంతో అలవాటు ప్రకారం పాక్ సైనికులు సరిహద్దుల వద్ద చెలరేగిపోయారు. పాక్ సైన్యాలు పేట్రేగిపోవడంతో భారత సైనిక దళాలు కూడా ధీటుగా బదులిచ్చాయి. పాకిస్తాన్ తక్షణమే కాల్పులు విరమించి వెనక్కి తగ్గకపోతే పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ కూడా పాకిస్తాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో, పాక్ సైన్యాలు వెనక్కి తగ్గక తప్పలేదు. కానీ మళ్ళీ షరా మామూలుగానే పాక్ సేనలు సరిహద్దుల వద్ద కాల్పులు మొదలుపెట్టాయి.

 

కొద్ది రోజుల క్రితం నరేంద్ర మోడీకి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇచ్చిన సమాధానం పాక్ ప్రభుత్వ ఆలోచన తీరుకు అద్దం పట్టేదిగా ఉంది. పాకిస్తాన్ భారత్ తో సత్సంబంధాలే కోరుకొంటోందని, సరిహద్దుల వద్ద శాంతి నెలకొల్పాలని తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంటే, భారత్ దానిని తమ బలహీనతగా భావిస్తోందని ఆక్షేపించారు. భారత్ సేనలే సరిహద్దులలో పాక్ సైనికులపై దాడులు చేస్తూ, పాక్ ప్రభుత్వంపై నిందలు మోపడం చాలా విచారకరమని ఆయన అన్నారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున ఎందుకు మేస్తుంది? పాక్ ప్రధాని స్వయంగా ఈవిధంగా మాట్లాడుతుంటే పాక్ మీడియా వేరే విధంగా మాట్లాడుతుందని భావించలేము. మీడియా ప్రభావంతో అప్పుడు పాక్ ప్రజలు కూడా భారత్ సేనలే తమ దేశంపై దాడులకు తెగబడుతున్నాయని భావించడం సహజం.

 

పాక్ ప్రభుత్వం కూడా సరిగ్గా అదే కోరుకొంటోంది. తమ దేశానికి భారత్ వల్ల తీవ్ర ప్రమాదం పొంచి ఉందనే అభద్రతా భావం వారిలో స్థిరంగా నెలకొని ఉన్నప్పుడే వారు పాక్ ప్రభుత్వ అసమర్ధతను ఉపేక్షించే అవకాశం ఉంటుంది. లేకుంటే మళ్ళీ వారు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. అందువల్ల పాక్ ప్రభుత్వం తన దేశంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడిన ప్రతీసారి భారత్-పాక్ సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం సృష్టిస్తోంటుంది. ఈ ఉపాయంతో పాక్ ప్రభుత్వం తన ప్రజలను మభ్యపెడుతూ చాలా తెలివిగా తన అసమర్ధతను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తోంది. కానీ దానివల్ల చివరకు ఆ దేశమే తీవ్రంగా నష్టపోతుంది.

 

భారతదేశం ఎన్నడూ కూడా ఇతరదేశాల మీదకు దండెత్తిన సందర్భాలు లేవు. కారణం అనాదిగా భారత్ సుసంపన్నమయిన దేశం కావడమే. నేటికీ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా పేరు తెచ్చుకొంది తప్ప ఇరుగు పొరుగుదేశాల సరిహద్దులలో జొరబడి ఆక్రమించుకొంటుందనే విమర్శ ఎన్నడూ వినబడలేదు. నిజానికి భారత్ తలుచుకొంటే ఏనాడో పాక్ ఆక్రమిత కాశ్మీరును కూడా తిరిగి తన స్వాధీనంలోకి తెచ్చుకొనేది. కానీ ఆపని చేయకపోవడానికి కారణం భారత్ శాంతికాముక దేశం కావడమే.

 

జాతిపిత మహాత్మా గాంధీ దేశం నుండి బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టేందుకు, బ్రిటిష్ సైనికుల చేతుల్లో లాటీ దెబ్బలు తినేందుకే సిద్దపడ్డారు తప్ప వారి మీద తన చేతి కర్ర ఎత్తాలని ఎన్నడూ ఆలోచించలేదు. ఆయన కర్ర ఎత్తి ఉండిఉంటే భారతదేశ భూత, భవిష్యత్ చరిత్ర మరో విధంగా ఉండేదేమో! ఆనాటి నుండి ఈనాటి వరకు దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా అన్నీ కూడా ఆయన చూపిన శాంతి మార్గంలోనే పయనిస్తున్నాయి. అందుకే కాశ్మీరులో కొంత భాగం పాక్ సేనలు ఆక్రమించుకొన్నప్పుడు అప్పటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ వారిని భారత భూభాగం నుండి తరిమికొట్టకపోగా, ఐక్యరాజ్యసమితికి పోయి మొరపెట్టుకొన్నారు.

 

భారత్ యొక్క ఆ శాంతికాముకతే నేడు చైనా, పాక్ వంటి దేశాలకు అసమర్దతగా కనబడుతోంది. అందుకే అవి భారతదేశంతో నిత్యం చెలగాటం ఆడే సాహసం చేయగలుగుతున్నాయి. కానీ మోడీ ప్రభుత్వం “ఇప్పుడు భారత్ లో కొత్త ప్రభుత్వం వచ్చిందని, అందువల్ల మారిన ఆలోచనా విధానాన్ని, మారిన పరిస్థితులను కూడా గుర్తించమని, లేకుంటే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని” పాక్, చైనా దేశాలకు చాలా గట్టి హెచ్చరికలే చేసింది. కానీ అంత మాత్రాన్న ఆ రెండు దేశాల ధోరణి మారుతుందని ఆశించడం కష్టం. ఎందువలన అంటే చైనాకు సామ్రాజ్య విస్తరణ కాంక్ష విపరీతంగా ఉంటే, పాకిస్తాన్ తీవ్ర అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. కనుక ఆ రెండు దేశాలు ఎన్నటికీ తమ వైఖరిని మార్చుకొనే అవకాశంలేదనే భావించవచ్చును. కనుక భారత్ ఎంత శాంతి కాముక దేశం అయినప్పటికీ సరిహద్దుల వద్ద ఆ రెండు దేశాలతో సమస్యలు తప్పవనే చెప్పవచ్చును.