టీడీపీ ఆఫీసు మీద దాడి టీఆర్ఎస్ తప్పిదమే

 

ఉద్యమం నడిపినట్టుగా ప్రభుత్వాన్ని నడపడం ఏ పార్టీకి కుదరదు. దానికి టీఆర్ఎస్ కూడా అతీతమేమీ కాదు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్న సమయంలో ఎన్నో సందర్భాలలో ఎంతోమంది మీద దాడులు జరిపింది. ఇప్పుడు మంత్రిగా వున్న హరీష్ రావు అయితే దేశ రాజధానిలోని ఏపీ భవన్‌లో ఒక దళిత ఉద్యోగి మీద దారుణంగా చేయి కూడా చేసుకున్నారు. అయితే ఇలాంటి దాడులు అప్పట్లో ‘ఉద్యమం’ అకౌంట్లోకి వెళ్ళిపోయాయి. టీఆర్ఎస్ అప్పట్లో జరిపిన దాడులు ఆ పార్టీకి మైలేజీ పెంచాయని అనడంలో సందేహించాల్సిన అవసరం లేదు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీలాగా వ్యవహరించకుండా ఒక ఉద్యమ పార్టీ తరహాలోనే వ్యవహరిస్తోంది. ఎన్నో విషయాల్లో ఈ తరహా వ్యవహారశైలి బయటపడింది. తాను ముఖ్యమంత్రి అయినప్పటికీ తనలో వున్న ఉద్యమకారుడి సోయి పోలేదని ముఖ్యమంత్రి కేసీఆరే ఒప్పుకున్నారు. అయితే అధికార పార్టీ ఉద్యమ పార్టీలా వ్యవహరించడం తప్పిదమే అవుతుంది. ఆ విషయాన్ని గ్రహించలేని టీఆర్ఎస్ తప్పుల మీద తప్పులు చేస్తోంది. తాజాగా నల్గొండలో టీడీపీ కార్యాలయం మీద టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేసి విధ్వంసం చేయడం కూడా టీఆర్ఎస్ పార్టీ తప్పిదమే అవుతుంది.

 

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలకు టీడీపీనే కారణమనే సాకును ఒకదాన్ని అడ్డుగా పెట్టుకుని టీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు. ఈ దాడి తెలంగాణ రాష్ట్రంలో వున్న టీఆర్ఎస్ వర్గాలకు సంతోషాన్ని కలిగించవచ్చేమోగానీ, తెలంగాణ ప్రజలకు మాత్రం ఎంతమాత్రం నచ్చని అంశం. అది కూడా అధికార పార్టీ హోదాలో వున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఇలా ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ధ్వంసం చేయడం అనేది అసలు ఎంతమాత్రం క్షమార్హం కాని విషయం. నల్గొండ టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు, దాడి చేయించిన టీఆర్ఎస్ నాయకులు భలే చేశామని భుజాలు చరుచుకుంటే చరుచుకోవచ్చేమోగానీ, ఈ సంఘటన అధికార పార్టీ మీద మచ్చలా మిగులుతుంది. రాష్ట్రంలో శాంతి భధ్రతలను కాపాడాల్సిన అధికార పార్టీయే శాంతి భధ్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడటం తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో తలవంపులు తెచ్చే ప్రమాదం వుంది. మీడియా వాళ్ళని పది కిలోమీటర్ల లోతులో పాతిపెడతానని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పరువు పోయాలా చేశాయి. ఇప్పుడు ఇలాంటి దాడుల సంఘటనలు తెలంగాణ రాష్ట్ర పరువును పాతాళానికి దిగజార్చే ప్రమాదం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.